‘కాంటాక్ట్‌ లెస్‌ సేల్స్‌’కు రెడీ అవుతున్న లిక్కర్‌‌ షాపు ఓనర్లు

‘కాంటాక్ట్‌ లెస్‌ సేల్స్‌’కు రెడీ అవుతున్న లిక్కర్‌‌ షాపు ఓనర్లు
  • సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చర్యలు
  •  ‘సేఫ్‌ షీల్డ్‌’ ప్రోగ్రామ్‌ పేరుతో గైడ్‌లైన్స్‌

న్యూఢిల్లీ: గ్రీన్‌ జోన్లలో ఈ నెల 4 నుంచి మద్యం షాపులు ఓపెన్‌ చేసేందుకు కేంద్రం పర్మిషన్‌ ఇవ్వడంతో షాపులను ఓపెన్‌ చేసేందుకు ఓనర్లు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఒక్కో షాపు దగ్గర ఒకేసారి కేవలం 5గురు మాత్రమే ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ దిశగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘సేఫ్‌ షీల్డ్‌’ ప్రోగామ్‌ను రూపొందిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) చైర్మన్‌ అమ్రిత్‌ కిరణ్‌ సింగ్‌ చెప్పారు. అన్ని షాపులకు రూల్స్ పాస్‌ చేసినట్లు చెప్పారు. వైన్‌ షాపుల దగ్గర కచ్చితంగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని, సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చూడాలని చెప్పాం అని అన్నారు. కౌంటర్లలో ట్రేలు ఏర్పాటు చేసి ‘కాంటాక్ట్‌ లెస్‌ సేల్స్‌’ ను చేపట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంస్‌తో కలిసి డోర్‌‌ డెలివరీ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామని, దానికి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రావాల్సి ఉందని సింగ్‌ చెప్పారు. దీని వల్ల రీటైల్‌ షాపుల దగ్గర జనాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని లిక్కర్‌‌ షాపులు బంద్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో మందు బాబులు చాలా ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా లిక్కర్‌‌ నుంచే ఎక్కువ ఆదాయం వచ్చే చాలా రాష్ట్రాలు మందు షాపులకు సడలింపు ఇవ్వాలని ఇప్పటికే చాలా సార్లు కేంద్రాన్ని కోరాయి. కాగా.. ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ ఎక్స్‌టెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం గ్రీన్‌ జోన్‌లోని మద్యం దుకాణాలు ఓపెన్‌ చేయొచ్చని చెప్పింది. కానీ ఒకేసారి ఐదుగురు కంటే ఎక్కువ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.