అరటి ఆకులతో కప్పులు, ప్లేట్లు

అరటి ఆకులతో కప్పులు, ప్లేట్లు

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా తయారీ
బనానా లీఫ్స్‌తో పేపర్ కూడా తయారు చేయొచ్చు
కొత్త టెక్నాలజీని కనుగొన్న తమిళనాడు యువకుడు

ప్లాస్టిక్… ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్య ఇది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పెద్ద ఎత్తున వేస్టేజీ పోగవుతోంది. అది భూమిలో కలిసేందుకు ఏండ్లు పడుతుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేస్తున్న ప్రభుత్వా లు… దీనికి ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తయారు చేయాలని కోరుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. బనానా లీఫ్ టెక్నాలజీని రూపొందించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. అరటి ఆకులతో కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, స్పూన్‌లు, ఎన్వలప్స్, గిఫ్ట్ బాక్సులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. విరుదునగర్ జిల్లాలోని వత్రాప్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల టెనిత్ ఆదిత్య ఈ ఘనత సాధించాడు. ఈ టెక్నాలజీతో అరటి ఆకులను మూడేళ్ల వరకు భద్రపరచవచ్చని ఆదిత్య చెప్పాడు. అరటి ఆకులతో పేపర్‌ను కూడా తయారు చేయొచ్చని, ఫలితంగా చెట్లను కాపాడుకోవచ్చని తెలిపాడు. తాను తయారు చేసే వస్తువులను వినియోగించిన తర్వాత వృథాగా పడేయాల్సిన పని లేదని, వాటిని ఆవులకు ఆహారంగా వేయొచ్చని వివరించాడు.

10 ఏళ్ల వయసులోనే ఆలోచన…
ఆదిత్య ఈ టెక్నాలజీ తయారు చేయడానికి 10 ఏళ్ల వయసులో బీజం పడింది. గ్రామంలోని రైతులందరూ అరటి ఆకులను వృథాగా పడేస్తుండడం గమనించిన ఆదిత్య… వాటితో ఏమైనా తయారు చేస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని ఆలోచించాడు. దానిపై చాలా రోజులు వర్క్ చేశాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా, వేస్టేజీ సమస్యను తగ్గించేందుకు అరటి ఆకులతో వస్తువులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల వయసులో టెనిత్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్టార్టప్ ప్రారంభించాడు. ఆదిత్య సీఈవోగా రన్ అవుతున్న ఈ స్టార్టప్‌కు బనానా లీఫ్ టెక్నాలజీకి గాను ఏడు ఇంటర్నేషనల్, 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. వీటిలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్, ఇంటర్నేషనల్ గ్రీన్ టెక్నాలజీ, టెక్నాలజీ ఫర్ ది ఫ్యూచర్ అవార్డ్స్ ఉన్నా యి. ‘‘మనం ప్రతిరోజు ప్లేట్లు, స్ట్రాలు, కప్స్, పాలిథిన్ కవర్లు… ఇలా చాలా వాటిని ఒక్కసారే వాడి పారేస్తాం. వాటితో పెద్ద ఎత్తున చెత్త పోగవుతోంది. దీనికి పరిష్కారంగానే నేను ఈ టెక్నాలజీని తయారు చేశారు. దీని ద్వారా కెమికల్స్ వాడకుండా అరటి ఆకులను మూడేళ్ల వరకు భద్రపరచవచ్చు. ఇది వాటి మన్నికను కూడా పెంచుతుంది. ఇలా భద్రపరిచిన ఆకులు అధిక టెంపరేచర్లను తట్టుకోగలవు. అలాగే సాధారణ ఆకుల కంటే వీటి బరువు ఎక్కువ ఉంటుంది” అని చెప్పాడు ఆదిత్య.

ఖర్చు కూడా తక్కువే..
‘‘అరటి ఆకులు ఒక్క రోజులోనే వాడిపోతాయి. అలా కాకుండా చేయడం కోసం చాలా రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యాను. నేను రూపొందించిన టెక్నాలజీ లీవ్స్ లైఫ్ స్పాన్ను పెంచింది. ఈ టెక్నాలజీలో కెమికల్స్ వాడకుండా ఆకులను మూడేళ్లు భద్రపరచవచ్చు. తర్వాత వాటితో వస్తువులు, పేపర్లు చేసుకోవచ్చు” అని ఆదిత్య వివరించారు. ఇది పూర్తిగా సెల్యూలర్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అన్నారు. నేచురల్ ప్రిజర్వేషన్ ప్రాసెస్‌తోనే పని చేస్తుందన్నారు. ఈ టెక్నాలజీతో భద్రపరిచే ఆకులు 100 శాతం బయోడిగ్రేడెబుల్ , ఎకో ఫ్రెండ్లీ అని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా 10 పైసలకే ఓ స్ట్రా, రూపాయికే ప్లేటు తయారు చేయొచ్చని తెలిపారు. ప్లాస్టిక్ స్ట్రా తయారీకి 70 పైసలు, ప్లేటు తయారీకి రూ.4 ఖర్చవుతుందని వివరించారు. ఈ టెక్నాలజీకి గాను ఆదిత్య పేటెంట్ పొందాడు. మనోడి టెక్నాలజీని యూఎస్, థాయ్ లాండ్, కెనడా వినియోగిస్తున్నా యి.

For More News..

యూత్‌కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’

రూ. 50 ఇయ్యలేదని చిన్నారి ఆత్మహత్య

మహిళలకోసం మహిళా వైన్ షాపులు