భారత్ జోడో యాత్రకు వ్యతిరేకంగా కేరళ హైకోర్టులో పిటిషన్

భారత్ జోడో యాత్రకు వ్యతిరేకంగా కేరళ హైకోర్టులో పిటిషన్
  • రాహుల్ యాత్రను కంట్రోల్ చేయండి
  • ట్రాఫిక్ ఇబ్బందులొస్తున్నయని  కేరళ హైకోర్టులో పిటిషన్

తిరువనంతపుర: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వ్యతిరేకంగా కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పాదయాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, కంట్రోల్ చేయాలని కోరుతూ విజయన్​ అనే లాయర్ పిటిషన్ వేశారు. ఆయన యాత్రకోసం ఈమధ్య నేషనల్ హైవేను గంటల తరబడి మూసివేశారని, దీంతో అనేకమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. యాత్ర రోడ్డుకు ఒకవైపే కొనసాగేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రెండో వైపు వాహనాలు  వెళ్లే అవకాశం ఉండాలన్నారు. అంతేకాకుండా ఆయన యాత్ర సెక్యూరిటీ ఏర్పాట్లకు భారీగా ఖర్చవుతోందని, వందలాది మంది పోలీసులు రోడ్లపొంటి మోహరిస్తున్నారని పేర్కొన్నారు. అందుకు అయ్యే ఖర్చంతా కాంగ్రెస్ పార్టీనే భరించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.

ఈ యాత్ర ప్రజా రోడ్డు రవాణా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, పబ్లిక్ రోడ్లపై అడ్డంకులు సృష్టించడం కిందకే వస్తుందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర కారణంగా   జనాలకు ట్రాఫిక్ కష్టాలు రాకుండా చూడాలని పిటిషన్​లో కోరారు. దీనిపై స్పందించిన కేరళ కాంగ్రెస్ నేత కొడికున్నికల్ సురేశ్ మీడియాతో మాట్లాడుతూ .. ట్రాఫిక్​కు, జనాలకు ఇబ్బందులు కలగకుండా నిర్వహిస్తామని, భద్రతా కారణాల వల్ల కొన్ని చోట్ల రోడ్లు మూసేసి ఉండవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో యాత్ర కొనసాగే మొత్తం 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాల అనుమతి ఇప్పటికే తీసుకున్నామని తెలిపారు.

కేరళలోని కొచ్చిలో కొనసాగిన రాహుల్ నడక

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 14వ రోజు గురువారం కేరళలోని కొచ్చి నుంచి కొనసాగింది. వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు, స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన వెంట నడిచారు. ఉదయం పాదయాత్రలో రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్​కూడా పాల్గొన్నారు.