
చిట్యాల, వెలుగు: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువమందికి సాయం అందించేలా మండలాధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె చిట్యాల తహసీల్దార్ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 2017 నుంచి మరణించిన వారి వివరాలను తెప్పించుకోవాలన్నారు.
కుటుంబ పెద్ద మగ లేదా ఆడ ఎవరు చనిపోయిన డెత్ సర్టిఫికెట్, ఆధార్, ఇతర సర్టిఫికెట్లు జత చేసి జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం కింద దరఖాస్తులను పంపించాలన్నారు. రూ. 20 వేలు ఆర్థిక సాయం వస్తుందని ఎక్కువ మందికి చేరేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తహసీల్దార్ కృష్ణనాయక్, సిబ్బంది ఉన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కలు నాటడంతో పాటు, వాటిని సంరక్షించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా, చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఉన్న హెటిరో కంపెనీ అనుబంధ సంస్థ దశమి లాబ్స్ ఫార్మా కంపెనీలో వనమహోత్సవంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. దశమి ఫార్మాస్యూటికల్ ల్యాబ్ ఆవరణ బాగుందని, పర్యావరణాన్ని కాపాడడానికి చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.