
- బఫర్ జోన్లను కబ్జా చేస్తున్రు
- రాళ్లవాగు, తోళ్ల వాగుల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు
- పొంచి ఉన్న ముంపు ముప్పు
- లీడర్ల జోక్యంతో పట్టించుకోని ఇరిగేషన్ ఆఫీసర్లు
కోల్‌బెల్ట్, వెలుగు: పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల జిల్లాలో భూముల ధరలు పెరగడంతో కబ్జాలు చేసి ప్లాట్లుగా మార్చి ప్రజలకు అంటగడుతున్నారు. కొంతమంది రియల్టర్లు, వాగు ఒడ్డుకు భూములు ఉన్న వారు బఫర్‌జోన్ లిమిట్స్ దాటి ప్లాట్లు, అక్రమ నిర్మాణాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మందమర్రి, నస్పూర్ మండల పరిధిలోని రాళ్లవాగు, తోళ్లవాగుకు రెండువైపులా ఇప్పటికే కొందరు ఆక్రమించుకోగా మరి కొన్ని నిర్మాణాలు సాగుతున్నాయి. బఫర్‌జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై లీడర్ల జోక్యం కారణంగా కంప్లైంట్స్ వస్తే తప్పా ఇరిగేషన్ ఆఫీసర్లు స్పందించడం లేదు. తమ నుంచి ఎవరికి పర్మిషన్ కానీ, ఎన్వోసీ కానీ ఇవ్వలేదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
రాళ్ల వాగు పొడవునా అక్రమాలే...
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాళ్లవాగు పొడవునా రెండు వైపులా ఆక్రమించారు. తమ భూమి వాగు కోతకు గురైందంటూ కొందరు వాగు ఒడ్డున ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. పాత తిమ్మాపూర్, కొత్త తిమ్మాపూర్, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈ తరహా అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులోని సర్వే నంబర్ 50 నుంచి 52 వరకు ఉన్న భూముల్లో బొక్కలగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తులు కొద్ది రోజుల కిందట సుమారు 9 ఎకరాల్లో వెంచర్‌ను ఏర్పాటు చేశారు. వెంచర్ ను ఆనుకొని రాళ్లవాగు ఉండటంతో దాని ఒడ్డుపై కన్నేశారు. వెంచర్ లోకి నీళ్లు రాకుండా రక్షణ పేరుతో ఏకంగా రాళ్ల వాగులోనే మట్టి పోసి భూమి కబ్జా చేశారు. ఈ ప్రాంతం బఫర్ జోన్ అని, భవిష్యత్‌లో ముంపు ముప్పు ఉంటుందని
తెలిసినా వాగులో సిమెంట్ గోడ కడుతున్నారు.
వర్షాకాలం ఏ మాత్రం వరద వచ్చినా నిర్మాణాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. వెంచర్ ఏర్పాటు చేసిన వారికి మందమర్రి మండల మాజీ ప్రజా ప్రతినిధి.... ప్రస్తుతం ఒక సంఘానికి వైస్ చైర్మన్, భూస్వామి ఒకరు అండగా నిలుస్తున్నారు. దీంతో వీరికి రియల్ ఎస్టేట్వ్యాపారంలో కొద్దిపాటి వాటా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాగు ఒడ్డున చేపట్టిన వెంచర్, నిర్మాణానికి ఇరిగేషన్, డీటీసీ పర్మిషన్ ఉందని పేర్కొంటున్నారు. దీని పై భాగంలో గతంలో వాగు బఫర్ జోన్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఒక వ్యక్తి ప్లాట్లు పెట్టారు.
పద్మావతి కాలనీ వెనక భాగంలోని బఫర్ జోన్‌ను మంచిర్యాల ప్రముఖ వ్యాపారి ఆక్రమించుకున్నారు. మంచిర్యాల పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో కూడా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఇక్కడా వాగు ఒడ్డు ప్రాంతంలో మట్టిని పోసి ఆక్రమించుకున్నారు. అయినా ఇరిగేషన్, మున్సిపల్ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. మరోవైపు వాగు పొడవునా నిత్యం అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. వందల ట్రాక్టర్లు ఇసుకను తరలించుపోతున్నాయి. ఊరు మందమర్రి చెరువును ఆనుకొని శిఖం భూముల్లో రియల్టర్లు ప్లాట్లు , వెంచర్ వేసినా, ఇరిగేషన్, మున్సిపల్ఆఫీసర్లు సదరు వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. అధికార పార్టీ లీడర్ల జోక్యంతో ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి.
రాళ్ల వాగు పరిరక్షణ గాలికి...
మందమర్రి మండలం బొక్కల గుట్ట, క్యాతనపల్లి మున్సిపాలిటీ సరిహద్దు మీదుగా రాళ్ల వాగు ప్రవహిస్తోంది. వాగులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం వల్ల భారీ వరదలు వచ్చినప్పుడు ముంపు ముప్పు పొంచి ఉంది. జీవో 168 ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో పది మీటర్ల కన్నా వెడల్పు ఉన్న వాగులకు కనీసం 9 మీటర్ల బఫర్ జోన్ వదిలేసి నిర్మాణాలు చేపట్టాలి. అసలు క్యాతనపల్లి మున్సిపల్ఆఫీసర్లు ఏ రోజు కూడా రాళ్లవాగు అక్రమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఐదేళ్ల కిందట రాళ్ల వాగు పరిరక్షణ పేరుతో లీడర్లు, ఆఫీసర్లు హడావిడి చేసి వదిలేశారు.
రాళ్లవాగు ఒడ్డున వెంచర్‌కు పర్మిషన్ లేదు
బొక్కలగుట్ట సమీపంలోని సర్వే నంబర్ 50, 51, 52లో వెంచర్ కోసం రాళ్ల వాగు బఫర్ జోన్‌ను ఆక్రమించుకొని గోడ కట్టిన విషయం మా దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఎమ్మార్వో ద్వారా సర్వే చేసి చర్యలు తీసుకుంటాం.
-సునీత, ఏఈ ఇరిగేషన్ శాఖ