అమరావతికి సహకరిస్త.. వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి

అమరావతికి సహకరిస్త.. వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి
  • వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి: ప్రధాని మోదీ
  • నేను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్న
  • రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడి
  • ఏపీలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • డిప్యూటీ సీఎం పవన్​కు చాక్లెట్ గిఫ్ట్​గా ఇచ్చిన ప్రధాని


అమరావతి, వెలుగు: అమరావతి అంటే.. ఒక నగరం కాదని.. ఓ శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీని ఆధునిక ప్రదేశ్‌‌‌‌‌‌‌‌, అధునాతన ప్రదేశ్‌‌‌‌‌‌‌‌గా మార్చే శక్తి అని తెలిపారు. యువత కలలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుందని ఆకాంక్షించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ ను గ్రోత్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని కోరారు. 

ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్య స్థానంగా మారుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‎లోని వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణ పనులను మోదీ శుక్రవారం ప్రారంభించారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, వైద్య రంగాలకు కేంద్రంగా అమరావతి మారుతుందన్నారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టిన మోదీ.. ‘‘దుర్గాభవానీ కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘రూ.60 వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశా.. అయితే, ఇవి కేవలం శంకుస్థాపనలే కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‎కు బలమైన పునాదులు’’అని చెప్పారు.

అప్పుడు నేర్చుకున్నవే.. ఇప్పుడు అమలు చేస్తున్న

టెక్నాలజీపరంగా చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ‘‘నాతోనే టెక్నాలజీ మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు. కానీ.. నేను ఈరోజు మీకొక రహస్యం చెప్తాను. నేను గుజరాత్​కు కొత్తగా సీఎంగా అయినప్పుడు హైదరాబాద్​లో ఉన్న చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తుంటారో తెలుసుకునేవాణ్ని. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఐటీని ఎలా డెవలప్ చేశారో తెలుసుకున్నా. అధికారుల్ని పంపించి ఐటీ అభివృద్ధిపై స్టడీ చేయించా. చంద్రబాబు నుంచి నేను చాలా నేర్చుకున్న.. అప్పుడు నేర్చుకున్నవే.. ఇప్పుడు అమలు చేస్తున్నాను. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. వాటిని త్వరగా పూర్తి చేయాలన్నా.. అది చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు’’అని మోదీ ప్రశంసించారు.

ఎన్టీఆర్ కలలను నిజం చేయాలి.. 

ఎన్టీఆర్.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్నో కలలు కన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందరం కలిసి ఏపీని వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌కు గ్రోత్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలన్నారు. ‘‘ఇది మనం చేయాలి... మనమే చేయాలి’’అంటూ చంద్రబాబు, పవన్​కల్యాణ్​ను మోదీ కోరారు. ‘‘విశాఖలో జూన్‌‌‌‌‌‌‌‌ 21న జరగనున్న యోగా డేలో పాల్గొంటాను. నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌’’ అని అన్నారు.

సరైన నేత.. దేశాన్ని పాలిస్తున్నరు: చంద్రబాబు

రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు అమరావతి నగరం ప్రతిరూపమని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో మోదీనే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ‘‘సరైన సమయంలో.. సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుంది. వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం, వ్యక్తిగతంగా ప్రధాని మోదీ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాం’’అని చంద్రబాబు అన్నారు. ‘‘పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో మోదీ ఉన్నారు. ఒట్టేసి చెప్తున్నా.. టెర్రరిజంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము అండగా ఉంటాం. కులగణన చేయాలని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది’’ అని చంద్రబాబు అన్నారు.

దేశమే మోదీ కుటుంబం: పవన్ కల్యాణ్

దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. ‘‘గత ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది. ధర్మయుద్ధంలో అమరావతి రైతులే విజయం సాధించారు. పహల్గాం దాడి ఘటనతో మోదీ గుండె బరువెక్కిపోయింది. అయినప్పటికీ.. అమరావతి రైతుల త్యాగాలకు విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి” అని పవన్ అన్నారు.

పవన్‌‌కు మోదీ చాక్లెట్ గిఫ్ట్ 

అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకున్నది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రసంగం ముగించుకుని చైర్​లో కూర్చున్నారు. పక్కనే ఉన్న మోదీ.. పవన్​కు సైగ చేశారు. ఆయన చూసుకోకపోవడంతో.. చంద్రబాబు విషయం చెప్పారు. ప్రధాని ఎందుకు పిలిచారోనని పవన్ హడావిడిగా వెళ్లారు. అప్పుడు మోదీ.. తన వద్ద ఉన్న చాక్లెట్ ను పవన్ కు ఇవ్వడంతో పక్కనే ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, పవన్​ కల్యాణ్​ స్పీచ్​ ముగించుకొని కాస్త దగ్గడంతో.. ‘దీన్ని తిని నీళ్లు తాగండి’ అంటూ క్యాండీని ప్రధాని మోదీ ఆప్యాయంగా అందజేశారని జనసేన, శతఘ్ని టీమ్​ ఒక ప్రకటనలో పేర్కొంది.  

విభజన టైమ్​లో కట్టుబట్టలతో గెంటేశారు: నారా లోకేశ్​

2014లో రాష్ట్ర విభజన జరిగిందని, కట్టుబట్టలతో మెడపట్టి తమను బయటికి గెంటేశారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​​ అన్నారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో కూడా తెలియని పరిస్థితుల నుంచి బయటపడ్డామని తెలిపారు. ‘‘చంద్రబాబు నాయుడికి సంక్షోభాలు కొత్త కావు. ఒకపక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రైతుల త్యాగాల ఫలితంగానే అమరావతి ఏర్పడింది. 2019 నుంచి 2024 వరకు విధ్వంస పాలన కొనసాగింది’’అని లోకేశ్​​ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు దేశం అండగా నిలబడుతుందని తెలిపారు. ‘‘ఒక పాకిస్తాన్ కాదు.. వంద పాకిస్తాన్​లు కలిసి వచ్చినా.. భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేవు. వంద పాకిస్తాన్​లకు సమాధానం చెప్పే ఒకే ఒక్క మిసైల్ మన దగ్గర ఉన్నది. అదే నరేంద్ర మోదీ మిసైల్. సింహం ముందు ఆటలాడొద్దు’’అని లోకేశ్​​ అన్నారు.