కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలె

కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలె

అహ్మదాబాద్ లో ‘సెంటర్-స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్’ ప్రారంభం     

అహ్మదాబాద్: సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని ప్రపంచానికే కేంద్రంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రీసెర్చ్, ఇన్నోవేషన్ లో ఇండియాను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. శనివారం గుజరాత్​లోని అహ్మదాబాద్ సైన్స్ సిటీలో జరిగిన ‘సెంటర్-–స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్’ ప్రారంభ సమావేశంలో ప్రధాని వీడియో లింక్ ద్వారా పాల్గొని మాట్లాడారు. పశ్చిమ దేశాల మాదిరిగా సైంటిస్టులు సాధించిన విజయాలను బాగా సెలబ్రేట్ చేసుకోవడంలో మన దేశం ఫెయిల్ అయిందని 
ఆయన విచారం వ్యక్తంచేశారు.  

జై జవాన్.. జై అనుసంధాన్ 

దేశంలో 2014 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోడీ చెప్పారు. ప్రపంచ ఇన్నోవేషన్ ఇండెక్స్​లో మన దేశం 2015లో 81వ ర్యాంక్ పొందగా, ఈ ఏడాది 46వ ర్యాంక్ సాధించిందన్నారు. ప్రస్తుతం ఇండియా ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ (సైన్స్), జై అనుసంధాన్ (రీసెర్చ్)’ అనే నినాదంతో ముందుకు పోతోందన్నారు. 

లోకల్ సమస్యలకు లోకల్ పరిష్కారాలు 

సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త కొత్త పాలసీలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని సూచించారు. రీసెర్చ్​ను లోకల్ లెవల్​కు తీసుకెళ్లాలని, లోకల్ సమస్యలకు లోకల్ పరిష్కారాలు కనిపెట్టేలా ప్రోత్సహించాలని చెప్పారు. కొత్త సంస్థలను నెలకొల్పాలని, ఇన్నోవేషన్ ల్యాబ్ లను పెంచాలని సూచించారు.  

బీహార్, జార్ఖండ్ గైర్హాజరు

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్, సహకారాన్ని పెంచే దిశగా తొలిసారిగా ఈ కాన్ క్లేవ్​ను నిర్వహిస్తున్నట్లు ప్రధాని ఆఫీసు వెల్లడించింది. కాన్ క్లేవ్ ప్రారంభ సమావేశంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్రాల మంత్రులు, అధికారులు, సైంటిస్టులు, ఎంట్రప్రెన్యూర్​లు హాజరయ్యారు. అయితే, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు గైర్హాజరు అయ్యాయి.