ప్రధాని మోడీ పై చిదంబరం విమర్శలు

ప్రధాని  మోడీ పై చిదంబరం విమర్శలు

జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కౌంటర్ ఇచ్చారు. దేశంలో అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చిందన్న మోడీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాల పనిని మాత్రమే కొనసాగిస్తోందని చిదంబరం విమర్శించారు.

"అన్ని గ్రామాలకు కరెంటు వచ్చిందని ప్రధాని ప్రకటించిన రోజే.. ఎన్‌డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదొక్కటే కరెంటు లేని కుగ్రామం కాదు. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు ఇంకా విద్యుత్‌ అందడంలేదని అంగీకరించడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు" అని చిదంబరం ట్వీట్ చేశారు.

కాగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ఆదివారం మ్యూనిచ్‌లోని ఆడిడోమ్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో వేలాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. కోట్లాది మంది భారతీయులు కలిసి పెద్ద లక్ష్యాలను సాధించిన తీరు అపూర్వమని అన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జనరహితంగా మారిందని, విద్యుత్‌ సౌకర్యం ఉందని మోడీ తన ప్రసంగంలో చెప్పారు.