ట్రంప్కు కంగ్రాట్స్... గాజా పీస్ ప్లాన్ను అభినందిస్తూ అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

ట్రంప్కు కంగ్రాట్స్... గాజా పీస్ ప్లాన్ను అభినందిస్తూ అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
  • ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన లీడర్ అని ట్వీట్

 న్యూఢిల్లీ:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో ఫోన్‌ లో మాట్లాడినట్టు ప్రధాని మోదీ తెలిపారు. గాజా పీస్ ప్లాన్ విజయవంతం కావడానికి కృషి చేసినందుకు గాను ఆయనకు కంగ్రాట్స్ చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిపైనా సమీక్షించినట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్టు ‘ఎక్స్‌’ లో మోదీ వివరించారు.  

అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును బలమైన నాయకుడని ప్రధాని మోదీ కితాబిచ్చారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ పెట్టారు.“ప్రెసిడెంట్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వానికి నిదర్శనం. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సాయం అందేలా చూడటం వల్ల శాశ్వత శాంతికి బాటలు పడుతాయని మేం ఆశిస్తున్నాం” అని తెలిపారు.  

నెతన్యాహుపై మోదీ ప్రశంసలు దారుణం: కాంగ్రెస్
 
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడం నైతికంగా దారుణమని, సిగ్గు మాలిన చర్యగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా భవిష్యత్తుపై ఆయన మౌనం వహించడాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’ లో కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేశ్ పోస్ట్ పెట్టారు. ‘‘గాజా కొత్త పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రెసిడెంట్ ట్రంప్ ను ప్రశంసించారు. 

ఆయన ఈ విధంగా చేయడం మనకు ఆశ్చర్యం కలిగించదు. కానీ, గత 20 నెలలుగా గాజాలో నరమేధం జరిపిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును మోదీ ప్రశంసించడం సిగ్గుమాలిన చర్య. నైతికంగా దారుణమైనది. 150కిపైగా దేశాలు గుర్తించిన స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా భవిష్యత్తుపై ఆయన పూర్తి మౌనం వహించారు” అని పేర్కొన్నారు.