కార్పొరేట్లకు ప్రధాని మోడీ లొంగిపోయారు

కార్పొరేట్లకు ప్రధాని మోడీ లొంగిపోయారు

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులపై వివాదం నడుస్తోంది. ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్‌‌సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్‌‌ రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కొత్త బిల్లులు చారిత్రాత్మకం అని, ప్రతిపక్షాల అబధ్దపు వలలో పడకూడదని రైతులకు మోడీ సూచించారు.

మోడీ కామెంట్స్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రధాని మోడీ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రధాని మోడీ, బీజేపీ అధికార ప్రతినిధులు కావాలనే కుట్రపూరితంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను వక్రీకరిస్తున్నారు. రైతులకు బహుళ మార్కెట్లు, ఎంపికల అవసరం ఉంది. రైతులకు అవి లభించేలా కాంగ్రెస్ ప్రతిపాదనలు రూపొందాయి’ అని చిదంబరం చెప్పారు. మోడీ కార్పొరేట్లు, ట్రేడర్స్‌‌కు సరెండర్ అయ్యారని ఆరోపించారు.