ఈసారి గ్యారంటీలతో ప్రజల ముందుకు: మోదీ

ఈసారి గ్యారంటీలతో ప్రజల ముందుకు: మోదీ

నల్బరీ(అస్సాం): 2014 ఎన్నికల్లో హోప్​ (నమ్మకం), 2019లో ట్రస్ట్(విశ్వాసం)తో ప్రజల వద్దకు వెళ్లామని, ఈ సారి గ్యారంటీలతో ఓట్లు అభ్యర్థిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం తన గ్యారంటీ అని పేర్కొన్నారు. పదేండ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చిన మార్పే మోదీ గ్యారంటీకి సాక్ష్యమని తెలిపారు. అస్సాంలోని నల్బరీ బోర్కురా మైదానంలో బుధవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ సమస్యలు తెచ్చిపెడితే.. బీజేపీ వాటికి పరిష్కారం చూపిందని తెలిపారు. ‘కాంగ్రెస్​ ఈ ప్రాంతంలో తిరుగుబాటుకు ఆజ్యం పోసింది.. కానీ బీజేపీ ఆలింగనం చేసుకొని శాంతిని నెలకొల్పంది. 60 ఏండ్లలో ఆ పార్టీ చెయ్యలేనిది.. బీజేపీ పదేండ్లలో చేసి చూపించింది’ అని మోదీ అన్నారు.   

ప్రతి పౌరుడికి వివక్షలేకుండా ప్రయోజనాలు

 ఎన్డీఏ ప్రభుత్వం ‘సబ్​ కా సాథ్​.. సబ్​ కా వికాస్’​ను విశ్వసిస్తోందని, దేశంలోని ప్రతి పౌరుడికి ఎలాంటి వివక్ష లేకుండా ప్రయోజనాలు అందేలా చూస్తుందని మోదీ పేర్కొన్నారు. రాబోయే ఐదేండ్లు ఫ్రీ రేషన్​ను కంటిన్యూ చేస్తామని చెప్పారు. వారి కుటుంబాలకు భారం కాకుండా 70 ఏండ్లు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్​ భారత్​ కింద రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే, రాబోయే ఐదేండ్లలో నిరుపేదలకు 3 కోట్ల ఇండ్లు నిర్మించి, ఇస్తామని చెప్పారు. 

పదేండ్లలో అభివృద్ధికి అస్సాం సాక్ష్యం

ఈ పదేండ్లలో అభివృద్ధికి అస్సాం సాక్ష్యంగా నిలుస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్దేశాలు సరైనవైతే.. ఫలితాలు సరిగ్గా వస్తాయని చెప్పారు. ‘కాంగ్రెస్​ పార్టీ తన స్వార్థంకోసం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతో అవినీతి, దోపిడీలో మునిగిపోయింది. బీజేపీ పాలనలో ఈ పరిస్థితి మారింది. ఈ ప్రాంతం సబ్​ కా సాథ్​.. సబ్​ కా వికాస్​ ప్రయోజనాలను అనుభవిస్తున్నది’ అని వివరించారు. 

ఇటీవలే అస్సాంలో సెమికండక్టర్​ టెస్టింగ్​ ఫెసిలిటీకి పునాది రాయి వేశామని గుర్తుచేశారు. సోలార్​ ప్యానెల్స్​తో కరెంటు బిల్లు జీరో వస్తుందని, దీనితో సంబంధం ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు లఖ్​పతి దీదీలుగా మారుతారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హమీనీ నెరవేర్చుతామని, పేదలు, నిరుపేదలు, దళితులు, రైతులు, టీ గార్డెన్​ వర్కర్ల​కు ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. ప్రజల కలల సాకారానికి, దేశం కోసం ప్రతి క్షణం తాను పనిచేస్తూనే ఉంటానని మోదీ స్పష్టం చేశారు.