నార్త్, సౌత్ అంటూ విభజిస్తరా?: ప్రధాని మోదీ

నార్త్, సౌత్ అంటూ విభజిస్తరా?:  ప్రధాని మోదీ
  • నార్త్, సౌత్ అంటూ విభజిస్తరా?
  • దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలె 
  • రాజ్యసభలో కాంగ్రెస్​పై ప్రధాని మోదీ ఫైర్ 
  • విభజన వాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం 
  • నిధుల కోసం ఢిల్లీకి వచ్చి ధర్నాలా? 
  • ఒక రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ పార్టీ ఇలా చేయడం దారుణం
  • మా బొగ్గు మాకే.. మా ట్యాక్స్ మాకే అంటే ఎలా?
  • ఇదెక్కడి న్యాయం.. ఇట్లయితే దేశం నడిచేదెట్లా? 
  • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకెళ్తదన్న పీఎం  

న్యూఢిల్లీ:  దేశాన్ని నార్త్, సౌత్ గా విభజించేలా కాంగ్రెస్ పార్టీ, కర్నాటకలోని ఆ పార్టీ ప్రభుత్వం మాట్లాడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. విభజన ప్రయత్నాలు దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య విభజన మాటలను ఆపేయాలని హితవు పలికారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని 90 నిమిషాల పాటు మాట్లాడారు. కర్నాటక ప్రభుత్వం ప్రకటనల రూపంలో ఇలాంటి ప్రచారం చేయడం సరికాదన్నారు. కేంద్రం నుంచి ట్యాక్స్ షేర్ లో కర్నాటకకు అన్యాయం జరుగుతోందంటూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో ధర్నా చేయడంపై మోదీ ఈ మేరకు సభలో తీవ్రంగా స్పందించారు. 

దేశం కూడా దేహం వంటిదే.. 

దేశమంటే కేవలం భూమి మాత్రమే కాదని, అది కూడా మనిషి శరీరం వంటిదేనని ప్రధాని అన్నారు. ఒకవేళ కాలుకు నొప్పి పెడితే.. దాని నొప్పితో తనకు సంబంధంలేదని చెయ్యి అనదన్నారు. అలాగే దేశంలో ఎక్కడ బాధ కలిగినా.. ప్రతి ఒక్కరికీ బాధాకరమైన విషయమే కావాలన్నారు. ‘‘శరీరంలో ఒక పార్ట్ పని చేయకపోతే మొత్తం శరీరాన్నే హ్యాండిక్యాప్ అని అంటారు. అలాగే దేశంలో ఏ ప్రాంతమైనా అభివృద్ధికి నోచుకోకపోయినా, దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారలేదు. అందుకే.. మనమంతా దేశాన్ని ఒక్కటిగా చూడాలి కానీ సపరేట్ పార్టులుగా కాదు” అని హితవు పలికారు. బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాలు తమ బొగ్గును ఇతర రాష్ట్రాలకు పంచబోమని అంటే.. దేశం ఎలా నడుస్తుందని మోదీ ప్రశ్నించారు.

‘‘ఉదాహరణకు తన వద్ద పుట్టే నదులు తనవేనని, ఇతరులు వాడుకోవద్దని హిమాలయాలు అంటే ఎలా ఉంటుంది? ఈశాన్య ప్రాంతం వారు ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ ను షేర్ చేసుకోబోమని అంటే ఏం జరుగుతుంది.. ఇదేం ఆలోచనా విధానం? మా ట్యాక్స్, మా డబ్బు.. అంటున్నారు. ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇదేం న్యాయం? ఇలాగైతే దేశం ఎలా నడుస్తుంది? ఒక జాతీయ పార్టీ నుంచే ఇలాంటి భాష రావడం చాలా బాధాకరం. దేశాన్ని ముక్కలు చేసే ఇలాంటి మాటలను ఆపండి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయండి” అని ప్రధాని కోరారు.  

స్టార్టప్ యువరాజు.. ఏదీ స్టార్ట్ చేయడు

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని యువరాజు అంటూ మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్ తన యువరాజును ఒక స్టార్టప్ మాదిరిగా లాంచ్ చేయాలని చూస్తోంది. కానీ ఆయన ఏదీ స్టార్ట్ చేయడు. ఆయనను ఎవరూ లిఫ్ట్ చేయలేరు. అలాగే లాంచ్ కూడా చేయలేరు” అని మోదీ సెటైర్ వేశారు.  కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఔట్ డేటెడ్ గా మారిపోయిందని, ఆ పార్టీ వారంటీ ముగిసిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. 

రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకం.. 

కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారని మోదీ చెప్పారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖ కూడా రాశారన్నారు.  

ప్రభుత్వాలను కాంగ్రెస్ కూలదోసింది.. 

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశంలో బహిరంగంగానే ప్రజాస్వామ్య గొంతు నులిమిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాత్రికి రాత్రే రద్దు చేసిందని మోదీ విమర్శించారు.

కాంగ్రెస్ కు 40 సీట్లైనా రావాలె..

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు కనీసం 40 సీట్లు అయినా రావాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు. ‘‘ఇటీవల బెంగాల్ నుంచి కాంగ్రెస్​కు సవాల్ ఎదురైంది. కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలవలేదని అంటున్నారని పరోక్షంగా మమతా బెనర్జీ కామెంట్లను ప్రస్తావించారు. ‘‘మేం మీరు చెప్పే ప్రతి మాటనూ వినాలని ఎంతో సహనంతో ఉంటున్నాం. కానీ చివరకు నేడు కూడా మీరు వినేందుకు సిద్ధంగా లేరు. మీరు నా గొంతుకను నొక్కలేరు. నా వాయిస్ కు ఈ దేశ ప్రజలు ఎంతో బలాన్ని ఇచ్చారు” అని మోదీ అన్నారు. ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయన్న ఖర్గే కామెంట్లను మోదీ ప్రస్తావించారు. ఈ మాటలను ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు. అయితే, ఖర్గేకు (కాంగ్రెస్​లో) అంత స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఎలా దక్కిందో అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 

మూడోసారీ గెలుస్తం

కేంద్రంలో మూడోసారీ ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మూడోసారి మా ప్రభుత్వం రావడం ఎంతో దూరం లేదు. కొందరు దానిని మోదీ 3.0 అని పిలుస్తారు. మోదీ 3.0 ప్రభుత్వం వికసిత్ భారత్​కు పునాదిని బలోపేతం చేస్తుంది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతుంది” అని మోదీ అన్నారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనతో దేశం సమస్యల వలయంలో చిక్కుకున్నదని, ప్రధానిగా తన మొదటి రెండు టర్మ్ లలో ఆ సమస్యల నుంచి దేశాన్ని తప్పించానన్నారు.  వికసిత్ భారత్ అనేది తమ కమిట్​మెంట్ అని మోదీ స్పష్టం చేశారు. వచ్చే ఐదేండ్లకు అద్భుతమైన రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో దేశానికి మూలస్తంభాలైన పేదలు, రైతులు, యువత, మహిళల సమస్యల పరిష్కారం గురించి మాట్లాడారని తెలిపారు.

నేడు ఒక ప్రత్యేకమైన విషయంపై నా బాధను తెలియజేస్తున్నా. రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో నార్త్, సౌత్ ప్రాంతాల మధ్య ప్రజలను విభజించేలా కాంగ్రెస్ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి భాషను మాట్లాడుతోంది. దేశానికి ఇంతకన్నా చెడ్డ విషయం ఇంకోటి ఉండదు. ఇలాంటి మాటలు దేశానికి మంచివి కావు. ఇవి దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి.