దేశంలో అన్ని సమస్యలకూ కాంగ్రెస్సే మూలకారణం: మోదీ

దేశంలో అన్ని సమస్యలకూ కాంగ్రెస్సే మూలకారణం: మోదీ
  • ఆ పార్టీని దేశమంతటా తుడిచిపెట్టేయాలి: మోదీ
  • కాంగ్రెస్, ఇండియా కూటమి ఉద్దేశాలు ప్రమాదకరం  
  • బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నరు 
  • రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఎన్నికల సభల్లో మాట్లాడిన పీఎం

కోట్ పుత్లి (రాజస్తాన్)/రుద్రపూర్(ఉత్తరాఖండ్):  దేశంలో ప్రతి సమస్యకూ మూలకారణం కాంగ్రెస్ పార్టీయేనని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. అవినీతిపరులను కాపాడేందుకు అవినీతిపరులంతా కలిసి ర్యాలీలు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీపై ఆయన విమర్శలు గుప్పించారు. మంగళవారం రాజస్థాన్ లోని కోట్ పుత్లిలో, ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ లో జరిగిన బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ‘‘బీజేపీ అంటే అభివృద్ధి.. కాంగ్రెస్ అంటే దేశంలో ప్రతి సమస్యకూ మూలకారణం. కాంగ్రెస్ వల్లే దేశంలో పేదరికం ఉండేది. కాంగ్రెస్ కారణంగానే మనం ప్రతి దానికీ విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది” అని ఆయన అన్నారు. “ఇండియాను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు, దేశంలో అవినీతిని కూకటివేళ్లతో పెకలించేందుకు జరుగుతున్న ఎన్నికలివి.

ఇండియా కూటమి సొంత ప్రయోజనాల కోసం తప్ప దేశం కోసం పని చేయదు. కుటుంబ పార్టీలు తమ కుటుంబాలను కాపాడుకోవడం కోసం ర్యాలీ తీయడం ఇదే ఫస్ట్ టైం. అవినీతిపరులను కాపాడేందుకు అవినీతిపరులంతా కలిసి ర్యాలీ తీయడం కూడా ఇదే మొదటిసారి. నేను అవినీతిని అంతం చేద్దామని అంటుంటే.. వారు అవినీతిపరులను కాపాడాలని అంటున్నారు” అని మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అగ్ర నేతలు తమ గెలుపు గురించి మాట్లాడటం లేదు. బీజేపీ గెలిస్తే దేశం మంటల్లో తగలబడిపోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్లు రాజేసిన మంటలను నేను ఇంకా ఆర్పుతూనే ఉన్నా” అని ఆయన చెప్పారు. గత పదేండ్ల బీజేపీ పాలన ట్రైలర్ మాత్రమేనని.. తన ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక చరిత్రాత్మక, నిర్ణయాత్మక చర్యలు ఉంటాయన్నారు.

అవినీతిపై చర్యలు తప్పవు.. 

బెదిరింపులు, దూషణలకు తాను భయపడ నని, ప్రతి అవినీతిపరుడిపైనా చర్యలు తీస్కుంటామని మోదీ చెప్పారు. ‘‘బీజేపీ గెలిస్తే దేశం మంటల్లో తగలబడుతుందని ప్రతిపక్ష పార్టీ రాజకుటుంబానికి చెందిన యువరాజు అంటున్నారు. వాళ్లు దేశాన్ని 60 ఏండ్లు పాలించారు. ఆ తర్వాత పదేండ్లు అధికారం కోల్పోగానే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ తో దేశం మంటల్లో తగలబడుతుందంటూ మాట్లాడుతున్నారు” అని ఆయన ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఒక్కొక్కరిని ఓడగొడ్తూ మైదానం నుంచి సాగనంపాలని, దేశంలో ప్రతి చోటు నుంచీ కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.