తెలంగాణపై మోడీ ఫోకస్​

తెలంగాణపై మోడీ ఫోకస్​
  • 6న బీజేపీ బూత్ కమిటీలతో ఇంటరాక్షన్
  • 8న సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం
  • సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ,నేషనల్ హైవేల పనులకు శంకుస్థాపన 
  • అదే రోజు పరేడ్ గ్రౌండ్​లో బహిరంగ సభ 
  • మేలో వరంగల్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు:తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇకపై ఆయన నెలకోసారి రాష్ట్రానికి రానున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీకి ఎక్కువ ఆదరణ ఉండడం, రాష్ట్రంలో మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ మరింత దృష్టి పెట్టింది. పోయిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకోవడంతో అప్పటి నుంచి ఫోకస్ పెడుతూ వస్తున్న హైకమాండ్.. ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు చేపడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా అవకాశం చిక్కినప్పుడుల్లా ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తూ  క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. నిరుడు జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇక్కడే నిర్వహించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందనే దానిపై ప్రజలకు వివరించడమే ప్రధాన లక్ష్యంగా మోడీ తన పర్యటనలకు శ్రీకారం చుట్టారని పార్టీ నేతలు అంటున్నారు.  

ఇదీ ప్రధాని టూర్ షెడ్యూల్.. 

ఈ నెల 6న దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్ కమిటీలతో ప్రధాని మోడీ ఇంటరాక్ట్ కానున్నారు. ఇందులో తెలంగాణలోని కొన్ని బూత్ కమిటీలు కూడా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 8న మోడీ రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ట్రైన్ ను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులతో పాటు ఆరు జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక మేలో మోడీ వరంగల్ కు వెళ్లనున్నారు. అక్కడ రైల్వే వ్యాగన్  ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. ఇదే టూర్ లో భాగంగా ఆయన హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న ఓ సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? ఎంత అప్పు ఇచ్చింది? అనే వివరాలతో కూడిన పుస్తకాన్ని  ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి. 

పోయినేడాది నాలుగుసార్లు.. 

పోయినేడాది నాలుగుసార్లు మోడీ రాష్ట్రానికి వచ్చారు. ఫిబ్రవరి 6న సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వచ్చారు. మే 26న ఐఎస్ బీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ టైమ్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఇక జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. నవంబర్ 12న రామ గుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్​కు వచ్చారు. ఆ టైమ్ లోనూ బేగంపేట్ ఎయిర్ పోర్టులో పార్టీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. కాగా, ఈ ఏడాది కూడా 2సార్లు ప్రధాని తెలంగాణ టూర్ ఖరారై వాయిదా పడింది. జనవరి 19, ఫిబ్రవరి 13న ప్రధాని రాష్ట్ర టూర్ ఖరారై వాయిదా పడింది.