లడఖ్‌లో సెంట్రల్ వర్సిటీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్?

లడఖ్‌లో సెంట్రల్ వర్సిటీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్?

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో తొలి సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. లడఖ్‌ను యూనియన్ టెర్రిటరీగా ఏర్పాటు చేయడంపై పార్లమెంట్‌లో నిర్ణయానికి ఏడాది అవనున్న సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రతిపాదిత సెంట్రల్ వర్సిటీలో అన్ని డిగ్రీలతోపాటు లిబరల్ ఆర్ట్స్, ఇంజినీరింగ్, మెడికల్ ఎడ్యుకేషన్‌ను మినహాయించి బేసిక్ సైన్సెస్ కోర్సులు ఉంటాయని తెలుస్తోంది. ఉన్నత విద్య కోసం లడఖ్‌కు చెందిన దాదాపు 10 వేల మంది స్టూడెంట్స్‌ తమ ఇళ్ల నుంచి వందలాంది కిలో మీటర్ల దూరానికి వెళ్లాల్సి వస్తోంది. అందుకే కేంద్రం సెంట్రల్ వర్సిటీకి ఆమోదం తెలిపిందని సమాచారం. లడఖ్‌లో ఇప్పటికే ఉన్న కాలేజీలు, వనరులను పూల్‌గా చేసి కాలేజీల క్లస్టర్‌‌ను ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.

లడఖ్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌‌లో ఏడాది కాలంలో తీసుకున్న చర్యల గురించి ప్రధాని మోడీ సోమవారం చేసిన రివ్యూలో వర్సిటీకి అప్రూవల్ లభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్‌కు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ దోవల్‌తోపాటు టాప్ అఫీషియల్స్ హాజరయ్యారు. గతేడాది ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌‌ రాష్ట్రానికి ఉన్న స్పెషల్ స్టేటస్‌ను తొలగించి, స్టేట్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టింది.