సముద్రంలో మోదీ స్విమ్మింగ్​

సముద్రంలో మోదీ స్విమ్మింగ్​
  • ట్యూబ్ తో గాలి పీల్చుకుంటూ.. సముద్రంలో ఈదిన ప్రధాని
  • సముద్రపు జీవరాశిని చూస్తూ..  లక్షద్వీప్​లో అడ్వెంచర్

న్యూఢిల్లీ :  ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లక్షద్వీప్ లో పర్యటించిన సందర్భంగా అడ్వెంచర్ స్విమ్మింగ్ చేశారు. ముఖానికి మాస్క్, నోట్లో స్నార్కెల్ (ట్యూబ్) పెట్టుకుని ఈదారు. ట్యూబ్ తో సముద్రం ఉపరితలంలోని గాలిని పీల్చుకుంటూ.. సముద్రం అడుగున జీవరాశిని చూస్తూ మోదీ స్నార్కెలింగ్ (స్నార్కెల్ ట్యూబ్ తో ఈదడం) చేశారు. తన స్నార్కెలింగ్ ఫొటోలను ప్రధాని గురువారం ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. లక్షద్వీప్ బీచ్ లో సేద తీరుతూ, సముద్ర తీరంలో నడుస్తూ దిగిన ఫొటోలను, దీవులు, సముద్ర జీవరాశుల ఫొటోలనూ ఆయన పోస్ట్ చేశారు.

‘‘అడ్వెంచర్ టూర్ లకు వెళ్లాలనుకునే ప్రతిఒక్కరూ తమ లిస్ట్ లో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలి. లక్షద్వీప్ పర్యటనలో నేను స్నార్కెలింగ్ చేశాను. నాకు అదో అద్భుతమైన అనుభూతిని కలిగించింది” అని మోదీ తెలిపారు. అరేబియా సముద్రంలోని ఈ దీవుల అందాలు, ప్రజల ఆదరణ తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయన్నారు. లక్షద్వీప్ లోని ప్రశాంతమైన వాతావరణం తనను మంత్రముగ్దుడిని చేసిందని, 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింతగా ఎలా కష్టపడి పనిచేయాలన్నది తెలియజేసిందని పేర్కొన్నారు.