
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. మన పొరుగుదేశం, పక్కలో బల్లెంలా మారిన చైనాలో కూడా మోడీ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అని చైనా నెటిజన్లు పొగుతున్నట్టు అమెరికాకు చెందిన మ్యాగజైన్ ‘ది డిప్లొమాట్’ వెల్లడించింది. ‘మోడీ లావోషియన్’ అంటూ చైనా నెటిజన్లు నిక్నేమ్కూడా పెట్టారు. లావోషియన్ అంటే ఇమ్మోర్టల్ (చిరంజీవి) అని అర్థం. ఇండియాను చైనా ఎలా చూస్తోంది అనే అంశంపై ఈ మ్యాగజైన్‌లో ఓ కథనం ప్రచురించింది.
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్స్‌ను విశ్లేషించే చున్‌షాన్ అనే జర్నలిస్టు ఈ కథనంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇతర నేతలతో పోలిస్తే మోడీ భిన్నమని చైనా నెటిజన్లు భావిస్తున్నారని, ఆయన వస్త్రధారణ, ఆహార్యం, విధానాలు మునుపటి నేతలతో పోలిస్తే ప్రత్యేకమైనవని, ఆశ్చర్య పరిచే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మొండితనం వంటివి గుర్తించి ఆయనను ఆ పేరుతో పిలుస్తున్నారని చున్‌షాన్ అభిప్రాయపడ్డారు. రష్యా, అమెరికా, దక్షిణాసియా దేశాలతో స్నేహపూ ర్వక సంబంధాలను కొనసాగించడం చైనా నెటిజన్లను ఆకర్షించిందని చెప్పారు. 20 ఏండ్లుగా తాను ఇంటర్నేషనల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నానని, చైనా నెటిజన్లు ఓ విదేశీ నేతపై ప్రశంసలు కురిపించడం ఎన్నడూ చూడలేదని చున్‌షాన్ చెప్పారు.