స‌ర్పంచ్ నుంచి ప్ర‌ధాని వ‌ర‌కు అంతా ఒక్క‌టే.. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతం కాదు

స‌ర్పంచ్ నుంచి ప్ర‌ధాని వ‌ర‌కు అంతా ఒక్క‌టే.. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతం కాదు

క‌రోనాకు, చ‌ట్టాల‌కు ఎవ‌రూ అతీతులు కాద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పారు. క‌రోనా వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునే విష‌యంలో అజాగ్ర‌త్త త‌గ‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీ జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు క‌రోనా విష‌యంలో లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నారో.. ఇప్పుడూ అంతే అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. “లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌ఠినంగా మాస్క్ ధ‌రించ‌డం, రెండు మీట‌ర్ల‌ దూరం పాటించ‌డం, 20 సెక‌న్ల పాటు చేతుల శుభ్రంగా క‌డుక్కోవ‌డం వంటివి పాటించారు. కానీ ఆంక్ష‌లు స‌డ‌లింపుతో అన్‌లాక్-1 మొద‌ల‌య్యాక ప్ర‌జ‌ల్లో నిర్ల‌క్ష్యం పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం ఎక్కువైంది. క‌రోనా బారిన‌ప‌డ‌కుండా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం అన్‌లాక్‌-2లోకి ప్ర‌వేశిస్తున్నాం. ప్ర‌జ‌లు మరింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌య‌మిది. వ‌ర్షాకాలం ప్రారంభ‌మ‌వుతోంది. సీజ‌న్ మార్పుతో జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి స‌ర్వ‌సాధార‌ణంగా మారుతాయి. ఈ స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు, స్థానిక సంస్థ‌లు, అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తం కావాలి. లాక్‌డౌన్‌లో మాదిరిగానే క‌ఠినంగా నిబంధ‌ల‌ను పాటించాలి” అని చెప్పారు ప్ర‌ధాని మోడీ. కంటైన్మెంట్ జోన్లలో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై స్థానిక ప్ర‌భుత్వ యంత్రాంగం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌న్నారు.

అంద‌రూ మాస్క్ ధ‌రించాలి.. ప్ర‌ధానికే ఫైన్

దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించ‌డం స‌హా సామాజిక దూరం పాటించ‌డం, చేతుల శుభ్రం చేసుకోవ‌డం మ‌ర్చిపోకూడ‌ద‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త చెప్పారు. క‌రోనా విష‌యంలో ఎవ‌రూ అతీతులు కాద‌ని, బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు త‌ప్ప‌క మాస్క్ పెట్టుకోవాల‌ని సూచిస్తూ.. ఇటీవ‌ల బ‌ల్గేరియా ప్ర‌ధాని మాస్క్ ధ‌రించ‌లేద‌ని ఆ దేశ ఆరోగ్య శాఖ జరిమానా విధించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. గ‌త గురువారం బ‌ల్గేరియాలో ఓ చ‌ర్చిలో జ‌రిగి కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆ దేశ ప్ర‌ధాని బోరిసోవ్ మాస్క్ పెట్టుకోకుండా వ‌చ్చారు. దీంతో ఆ దేశ ఆరోగ్య శాఖ మాస్క్ అవ‌స‌రాన్ని తెలియజేసేలా ప్ర‌ధానికి రూ.13 వేల జ‌రిమానా విధించింది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఓ దేశ ప్ర‌ధానికే మాస్క్ ధ‌రించ‌నందుకు రూ.13 వేల ఫైన్ విధించార‌ని, భార‌త్‌లోనూ ఇలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు ప్ర‌ధాని మోడీ. గ్రామ స‌ర్పంచ్ మొద‌లు దేశ ప్ర‌ధాని వ‌ర‌కు అంద‌రూ చ‌ట్టం ముందు ఒక‌టేన‌ని, ప్రాణాల‌ను కాపాడుకునేందుకు మాస్క్ ధ‌రించే విష‌యంలో అశ్ర‌ద్ధ త‌గ‌ద‌ని హెచ్చ‌రించారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ను అంద‌రూ క‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని అన్నారు. నిబంధ‌న‌లు పాటించని వారికి జరిమానాలు విధించాలని స్థానిక ప్ర‌భుత్వాల‌కు సూచించారు. తోటి వారంతా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మాస్క్ పెట్టుకునేలా సూచించాల‌ని, ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు.