వచ్చే పదేళ్లు ఉత్తరాఖండ్ వే

వచ్చే పదేళ్లు ఉత్తరాఖండ్ వే
  • మహాయజ్ఞం చేస్తున్నం
  • ఉత్తరాఖండ్‌‌‌‌లో పదేండ్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నం: ప్రధాని మోడీ
  • రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన
  • రూ.8,300 కోట్లతో ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పదేండ్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు మహాయజ్ఞం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ‘‘ఈ మహాయజ్ఞంలో భాగంగానే ఇన్‌‌‌‌ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించాం. కొన్నింటికి శంకుస్థాపనలు చేశాం. కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు డబుల్, ట్రిపుల్ వేగంతో పనులు చేస్తున్నాం” అని వివరించారు. గత ప్రభుత్వాలు తమ సొంత ఖజానా నింపుకునేందుకే పనిచేశాయని మండిపడ్డారు. శనివారం ఉత్తరాఖండ్‌‌‌‌లో రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. ఇందులో రూ.8,300 కోట్లతో ఢిల్లీ–డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ పనులకు పునాదిరాయి వేశారు. డెహ్రాడూన్‌‌‌‌లోని పరేడ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘వచ్చే పదేళ్లను ‘ఉత్తరాఖండ్ డెకేడ్‌‌‌‌’గా మార్చడంలో ఈ ప్రాజెక్టులు ఉపయోగపడుతాయి. ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం ఐదేళ్లలో లక్ష కోట్లను ఇచ్చాం” అని వెల్లడించారు.


ప్రయాణ సమయం సగానికి తగ్గుతది
ఢిల్లీ, డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుందని చెప్పారు. ఉత్తరాఖండ్‌‌‌‌లో 2007 నుంచి 2014 దాకా కేంద్రం రూ.600 కోట్ల ఖర్చుతో కేవలం 288 కిలోమీటర్ల నేషనల్ హైవేలను మాత్రమే నిర్మించిందని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం రూ.12 వేల కోట్లతో 2 వేల కిలోమీటర్ల మేర నిర్మించిందన్నారు. ‘‘నేషన్ ఫస్ట్ అనే మంత్రాన్ని మేం ఫాలో అవుతాం. వివక్ష లేకుండా అందరికోసం పథకాలు తీసుకొస్తాం. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయం. ప్రజలకు సేవ చేయడానికే ప్రాధాన్యమిస్తాం. మా విధానం దేశాన్ని బలోపేతం చేసింది” అని వివరించారు.