కాశీలో గంగా హారతి, లేజర్‌‌ షో.. షిప్‌లో నుంచి వీక్షించిన మోడీ

కాశీలో గంగా హారతి, లేజర్‌‌ షో.. షిప్‌లో నుంచి వీక్షించిన మోడీ

వారణాసిలో గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు కలిసి గంగా నదిలో క్రూయిజ్‌ షిప్‌లో ప్రయాణించారు. బోట్‌లోనే ఉండి గంగా హారతి, లేజర్ షోలను వీక్షించారు. దీనిపై ఆయన తన ట్విట్టర్‌‌ పోస్ట్ చేశారు. కాశీకి అతి పెద్ద స్వప్నమైన ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొన్నానని ట్వీట్ చేశారు. గంగా మాత దీవెనలు పొందానని, కాశీ గంగా హారతిలో పాల్గొన్న ప్రతిసారీ అంతరాత్మలో కొత్త శక్తి నిండుతుందని మోడీ పోస్ట్‌ చేశారు.

కాగా,  గంగా నది ఘాట్లను, కాశీ విశ్వనాధుడి ఆలయాన్ని కలుపుతూ నిర్మించిన కారిడార్‌‌ ఫేజ్‌ 1ను ఆవిష్కరించే ముందు నరేంద్ర మోడీ.. కార్మికులపై పూలు చల్లి గౌరవించారు. అనంతరం వారితో కలిసి ఆయన ఒక గ్రూప్‌ ఫొటో తీసుకున్నారు. అలాగే కార్మికులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు ఆవిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చమట చిందించిన సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. కరోనా ప్యాండెమిక్ సమయంలోనూ కార్మికులు పనులు ఆపలేదన్నారు. ఇప్పుడు వాళ్లను కలిసి ఆశీర్వాదం తీసుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ కారిడార్ కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాత సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోడీ అన్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ నిర్మాణంలో ఇది సరికొత్త అధ్యయమని, కాశీలో అడుగుపెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతోందని అన్నారు. కారిడార్ నిర్మాణంలో శ్రామికుల కష్టం వెలకట్టలేనిదన్నారు. ఈ కారిడార్ సాయంతో దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవచ్చని తెలిపారు మోడీ.