కామన్వెల్త్లో గెలిచిన క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆతిథ్యం

కామన్వెల్త్లో గెలిచిన క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆతిథ్యం

కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో  ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు.  అథ్లెట్లను కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.  క్రీడాకారుల కుటుంబ సభ్యులు. భారతీయులందరిలానే తాను కూడా అథ్లెట్లతో మాట్లాడటాన్ని గర్వంగా ఫీలవుతున్నాని చెప్పారు. అథ్లెట్ల కఠోర శ్రమ, స్ఫూర్తిదాయకమైన విజయాలతో దేశం ‘ఆజాదీ కా అమృత్‌ కాలంలోకి అడుగుపెట్టడం గర్వించదగ్గ విషయమని ప్రధాని అన్నారు.

ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. స్వర్ణ పతక విజేత బాక్సర్‌ నీతూ ఘంఘస్‌, బ్మాడ్మింటన్‌ స్టార్‌, గోల్డ్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు, క్రికెటర్‌ రేణుకా సింగ్‌తో పాటు రెజ్లర్‌ పూజా గెహ్లోత్‌ పేర్లను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. అథ్లెట్లు దేశానికి పతకాలు సాధించడమే కాకుండా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్పూర్తిని బలోపేతం చేశారని మోడీ కొనియాడారు. ప్రతి రంగంలో యువతకు స్ఫూర్తినిచ్చారని ప్రధాని మోడీ అన్నారు. గత కొన్ని వారాల్లో దేశం క్రీడా రంగంలో రెండు పెద్ద విజయాలు సాధించిందని ప్రధాని అన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు, దేశంలో మొదటిసారిగా చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహించామని ప్రధాని చెప్పారు. 

కామన్వెల్త్ లో మహిళల ప్రదర్శన అమోఘం..
కామన్వెల్త్ లో మహిళల ప్రదర్శన అమోఘమని మోడీ చెప్పారు. బాక్సింగ్, జూడో, రెజ్లింగ్ వంటి క్రీడల్లో భారత మహిళలు ఆధిపత్యం చెలాయించారని ప్రశంసించారు. గతంతో పోలిస్తే ఈసారి నాలుగు కొత్త గేమ్‌లలో  మెడల్స్ సాధించారని.. లాన్ బౌల్స్ నుండి అథ్లెటిక్స్ వరకు, అద్భుతమైన ప్రదర్శన చేశారని తెలిపారు. ఈ ప్రదర్శనతో దేశంలో కొత్త క్రీడల పట్ల యువతలో ఆసక్తి చాలా పెరగనుందన్నారు. కామన్వెల్త్ ద్వారా త్రివర్ణ పతాకం శక్తి మరోసారి ప్రపంచానికి తెలిసిందని మోడీ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ..భారతీయులకే కాకుండా ఇతర దేశాల ప్రజలకు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు త్రివర్ణ పతాకం రక్షణ కవచంగా నిలిచిందని తెలిపారు. 

జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగిన  కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 61 మెడల్స్ సాధించి పతకాల పట్టికలో నాల్గో స్థానంలో  నిలిచింది. ఇందులో 22 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 23 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో 10 పతకాలు సాధించగా, రెజ్లింగ్ ఆరు స్వర్ణాలతో సహా 12 పతకాలతో పతక పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.