మా స్టార్టప్​లు సూపర్…​ పెట్టుబడులతో రండి: మోడీ

మా స్టార్టప్​లు సూపర్…​ పెట్టుబడులతో రండి: మోడీ

    గ్లోబల్​ ఇన్వెస్టర్లకు మోడీ పిలుపు

    సౌదీ అరేబియా ఆర్థిక సదస్సులో ప్రధాని ప్రసంగం

   కింగ్​ సల్మాన్​, క్రౌన్​ప్రిన్స్​ ఎంబీఎస్​తో చర్చలు.. పలు ఒప్పందాలు

రియాద్​: దేశంలోని త్రీటైర్​(మూడో శ్రేణి) సిటీల్లోనూ స్టార్టప్​లు పుట్టుకొస్తున్నాయని, ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్​ ఎకోసిస్టమ్​గా ఇండియా ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దీన్నుంచి లాభాలు పొందేందుకు పెట్టుబడులతో రావాల్సిందిగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఫ్యూచర్​ ఇన్వెస్ట్​మెంట్​ ఇనిషియేటివ్​(ఎఫ్​ఐఐ) పేరుతో సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఆర్థిక సదస్సులో మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘దావోస్​ ఇన్​ డెజర్ట్​’గా పిలిచే ఈ సదస్సులో ఆర్థిక వ్యవస్థలపై చర్చతోపాటు వరల్డ్​ ట్రెండ్స్​ను అర్థం చేసుకోడానికి వీలవుతుందని, తద్వారా ప్రపంచ సంక్షేమానికి మార్గాల్ని కనిపెట్టడం సులువవుతుందని నిర్వాహకులను మోడీ కొనియాడారు. వచ్చే ఐదేండ్లలో ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ మేరకు అన్ని రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు.

సౌదీ అరేబియాతో ఇండియా ట్రేడ్​ రిలేషన్​ను గుర్తుచేస్తూ ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్​ పైప్​లైన్లు, గ్యాస్ టెర్మినల్స్ నిర్మాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య 2024నాటికి 100 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్​మెంట్లు వస్తాయని, ‘‘వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్‌‌”పేరుతో ఆసియాలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్మించబోతున్నాయని మోడీ గుర్తుచేశారు. టెర్రరిజం, మిడిల్​ఈస్ట్​లో కల్లోలంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. దేశాల మధ్య సంక్షోభాల్ని నివారించడంలో యునైటెడ్​ నేషన్స్​(యూఎన్​) ఆశించినమేరకు పనిచేయడంలేదని, యూఎన్​ స్వరూపాన్ని రీఫామ్​ చేయాల్సిన అవసరముందని మోడీ అన్నారు. ఎఫ్​ఐఐ సదస్సులో పాల్గొనడానికి ముందు సౌదీ రాజు సల్మాన్​ బిన్​తో, క్రౌన్​ప్రిన్స్ మొహమ్మద్​ బిన్​ సల్మాన్​(ఎంబీఎస్​)తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

చారిత్రాత్మక బంధం

సౌదీతో ఇండియాకు వందల ఏండ్లుగా ఫ్రెండ్షిప్​ కొనసాగుతున్నదని, అభివృద్ధిలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్​ వినియోగదారైన ఇండియా తాను దిగుమతి చేసుకునే చమురులో 17 శాతం, ఎల్‌‌పీజీలో 32 శాతం సౌదీ అరేబియానుంచే వస్తుండడం తెలిసిందే. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సౌదీ నుంచి 40.33 మిలియన్ టన్నుల క్రూడ్​ ఆయిల్​ను ఇండియా దిగుమతి చేసుకుంది.