
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రిజర్వ్ బ్యాంక్ కొత్తగా తీసుకొచ్చిన RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు మోడీ. ఈ రెండు పథకాల వల్ల దేశంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. మూలధన మార్కెట్‌ను వినియోగదారులు మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్ వ్యవస్థ రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు. ‘మరింత ప్రభావవంతంగా సేవలందించేందుకు ఆర్‌బీఐ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తోంది. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో సురక్షిత మాధ్యమం ద్వారా పెట్టుబడులు పెట్టడం సాధ్యం అవుతుంది’ అని మోడీ చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.