
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించిన రంగాలలో రూ.42 వేల కోట్ల ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.35,440 కోట్లతో రెండు ముఖ్యమైన పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో ముఖ్యంగా రూ.24వేల కోట్లతో 'ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన' కూడా ఉంది.
ధన్ ధాన్య కృషి యోజన పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో దిగుబడిని పెంచడం, రైతులు రకరకాల పంటలు పండించేలా ప్రోత్సహించడం, పంటలు కోసిన తర్వాత వాటిని పంచాయతీ, బ్లాక్ స్థాయిలో నిల్వ చేసుకునే సౌకర్యాలు పెంచడం అలాగే నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, ఎంపిక చేసిన 100 జిల్లాల్లో రైతులకు రుణాలు సులభంగా దొరికేలా చేయడం.
దీనితో పాటు ప్రధాని మోదీ రూ.11,440 కోట్ల పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ను కూడా మొదలుపెట్టారు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం పప్పుధాన్యాల ఉత్పత్తి స్థాయిని పెంచడం, పప్పుధాన్యాలు పండించే ప్రాంతాన్ని విస్తరించడం, వాటిని కొనడం, నిల్వ చేయడం, ప్రాసెసింగ్ వంటి ప్రక్రియలను బలోపేతం చేయడం, నష్టాలను తగ్గించడం.
ఇతర ప్రాజెక్టులు, శంకుస్థాపనలు: వ్యవసాయం, పశు పోషణ, చేపల పెంపకం, ఆహార శుద్ధి రంగాలలో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని దేశానికి అంకితం చేసారు. అలాగే దాదాపు రూ.815 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు.
ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) లో జరిగే ప్రత్యేక 'కృషి కార్యక్రమంలో' కూడా పాల్గొన్నారు. అక్కడ ఆయన రైతులతో మాట్లాడి, ఆ తర్వాత ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమం రైతుల సంక్షేమం, వ్యవసాయంలో స్వావలంబన, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే ప్రధాని నిబద్ధతను చూపిస్తుంది. కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రైతులకు అండగా నిలబడడం దీని ముఖ్య ఉద్దేశాలు.
ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవం & శంకుస్థాపనలు: ప్రధానమంత్రి రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభి, రూ.815 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు, వీటిలో...
*బెంగళూరు & జమ్మూ కాశ్మీర్‌లలో కృత్రిమ గర్భధారణ శిక్షణా కేంద్రాలు
*అమ్రేలి & బనాస్‌లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
*అస్సాంలో IVF ల్యాబ్
*మాంసం ప్రాసెసింగ్ , మత్స్య పరిశ్రమ, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
*ఉత్తరాఖండ్, నాగాలాండ్ , ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య సాగు ప్రాజెక్టులు
*ఈ కార్యక్రమాలు రైతుల జీవితాలను సులభం చేయడమే కాకుండా వారి ఆదాయాలను పెంచుతాయని, భారతదేశ వ్యవసాయ రంగాన్ని మరింతగా బలోపేతం చేస్తాయని, స్వయం స్వావలంబన సాధిస్తాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు .