బండి సంజయ్ అరెస్ట్ పై మోడీతో.. నడ్డా, అమిత్ షాతో చర్చలు

బండి సంజయ్ అరెస్ట్ పై మోడీతో.. నడ్డా, అమిత్ షాతో చర్చలు

ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం జరిగిన ఈ మీటింగ్ లో.. దేశంలోని రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత.. నడ్డా, అమిత్ షా.. ప్రధానమంత్రి మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఎంపీ అయిన బండి సంజయ్ అరెస్ట్ అయిన అంశంపై వీరు చర్చించారు. జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మోడీ పర్యటనకు ముందు ఇలా జరగటంపై చర్చించారు. అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ కు కారణాలు ఏంటీ.. ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అరెస్ట్ చేసిన తీరును ప్రధాని మోడీకి వివరించారు నడ్డా, అమిత్ షా. 8వ తేదీన రాష్ట్రంలో పర్యటించాల్సిన ఉన్న క్రమంలో.. ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయటం.. చేసిన తీరును ప్రధాని మోడీకి వివరించారు నడ్డా, అమిత్ షా

టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన తీరు రాజకీయ కుట్రలో భాగంగానే ఉందని మోడీకి.. నడ్డా వివరించినట్లు సమాచారం. పరీక్ష సమయం పూర్తయ్యే సమయానికి.. రెండు గంటల తర్వాత.. పరీక్ష రాసిన విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో పేపర్ లీక్ అయ్యినట్లు పోలీసులు చెప్పటం వెనక ఉద్దేశం ఏంటనే ప్రశ్నలను జేపీ నడ్డా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. 

ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సైతం స్పందించినట్లు తెలుస్తుంది. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించాలని.. బండి సంజయ్ కు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని స్పష్టం చేశారాయన. రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు మోడీ.