
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని రేసాన్ ప్రైమరీ స్కూల్‌లో ఆమె ఓటు వేశారు. 99 ఏళ్లున్న హీరాబెన్ మోడీ.. వీల్‌ఛైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమెతో పాటుగా అహ్మదాబాద్‌లో ప్రధాని సోదరుడు సోమభాయ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మోడీ అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు . కాలినడక పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన క్యూలైన్‌లో నిల్చుని ఓటేశారు.
అటు గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 14 రాష్ట్రాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. కాగా డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో మొత్తం 63.14 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ను ఏలుతోన్న బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా ఆ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి.