ఫ్లెక్సీలో పీఎం ఫోటో లేదని ప్రజాపాలన అడ్డుకున్నరు !

ఫ్లెక్సీలో పీఎం ఫోటో లేదని ప్రజాపాలన అడ్డుకున్నరు !
  •     అలాంటి రూల్ ​లేదన్న తహసీల్దార్​
  •     ఆందోళనతో రెండు గంటల పాటు నిలిచిపోయిన  గ్రామసభ
  •     ఎట్టకేలకు ప్రధానమంత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఆఫీసర్లు 
  •     మెదక్ ​జిల్లా వెల్మకన్నలో ఘటన 

కౌడిపల్లి, వెలుగు :  మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో గురువారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించగా.. ఫ్లెక్సీలో ప్రధాన మంత్రి ఫొటో లేదని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆఫీసర్లకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. గ్రామసభ నిర్వహించేందుకు ఉదయం తహసీల్దార్​ ఆంజనేయులు, ఇతర సిబ్బంది గ్రామానికి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ బీజేపీ జిల్లా లీడర్​రాజేందర్, పార్టీ మండల అధ్యక్షుడు రాకేశ్  ప్రశ్నించారు. దీనికి ఆఫీసర్లు అలాంటి రూల్స్​ఏవీ లేవని చెప్పారు. దీంతో బీజేపీ లీడర్లు కచ్చితంగా ఫ్లెక్సీలో మోడీ ఫొటో ఉంటేనే గ్రామసభ నిర్వహించాలని లేదంటే బహిష్కరిస్తామన్నారు. ఈ క్రమంలో తహసీల్దార్​ ఆంజనేయులుకు, బీజేపీ నాయకులకు గొడవ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు గ్రామసభ నిలిచిపోగా విషయం తెలుసుకున్న నర్సాపూర్ ​సీఐ షేక్​లాల్​మదర్, చిలప్​చెడ్ ​ఎస్ఐ రమేశ్ ​పోలీస్ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. చివరకు  ప్రజాపాలన ఫ్లెక్సీలో మోడీ ఫొటో ఏర్పాటు చేయడంతో గ్రామసభ ప్రారంభమైంది.