మోదీ గుడ్ న్యూస్..వచ్చే ఐదేళ్లు రేషన్ ఫ్రీ

మోదీ గుడ్ న్యూస్..వచ్చే ఐదేళ్లు రేషన్ ఫ్రీ

తాము అధికారంలోకి వస్తే  వచ్చే ఐదేళ్ల పాటు రేషన్ ఫ్రీగా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.  2024 ఏప్రిల్ 14న బీజేపీ పార్టీ కార్యాలయంలో  లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు మోదీ. అనంతరం మాట్లాడుతూ..వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు.  మహిళలు,పేదలు, యువత, రైతుల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. నాలుగు స్తంభాలతో మేనిఫెస్టోకు పునాదులు వేశామన్నారు మోదీ.  

మేనిఫెస్టో తయారికి సూచనలు ఇచ్చిన లక్షల మందికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ మేనిఫెస్టోను రూపొందించిన రాజ్ నాథ్ సింగ్ బృందానికి  మోదీ అభినందనలు తెలిపారు.  పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామన్న మోదీ.. మరో 3 కోట్ల ఇళ్లు నిర్మాస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నేరవేరుస్తుందని తెలిపారు.  70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్ర యోజన కింద లోన్ల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు.  భవిష్యత్తులో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు.

బీజేపీ ‘సంకల్ప పత్ర’ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్,  సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ప్రధాన పరిపాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ కోసం ప్రధాని మోదీ సమయాన్ని కేటాయిస్తారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. దేశ అభివృద్ధే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. అంబేడ్కర్ బాటలోనే తాము పయనిస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తామన్నారు.