అలయ్ బలాయితో సామాజిక బంధాలు బలోపేతం

అలయ్ బలాయితో సామాజిక బంధాలు బలోపేతం

న్యూఢిల్లీ: ‘అలయ్ బలాయి’తో మనుషుల మధ్య బంధాలు బలోపేతమవుతాయని పీఎం మోడీ అన్నారు. దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో నిర్వహించిన అలయి బలాయి కార్యక్రమంపై మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన దత్తాత్రేయకు లేఖ రాశారు. ఈ సందర్భంగా బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పూట అన్ని సామాజిక వర్గాల ప్రజలను ఏకం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని మోడీ లేఖలో పేర్కొన్నారు.  అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై పండుగలను జరుపుకునే సాంప్రదాయం భారత్ లో ఉందన్న మోడీ... తెలంగాణ సంస్కృతిలో అలయి బలాయి ఒకటి కావడం విశేషం అన్నారు. 

అలయి బలాయి కార్యక్రమంలో భాగంగా  కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రధాని కొనియాడారు. ఇప్పటికే దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా అలయి బలాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, భవిష్యత్ లో కూడా ఈ ఆచారాన్ని కొనసాగించాలని సూచించారు.  ఐదు సూత్రాల మిషన్‌కు అలయ్ బలాయి కార్యక్రమం దోహదపడనుందని,  2047 వరకు దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.