స్పోర్ట్స్​లోనే కాదు.. డైలీ లైఫ్​లోనూ ఫిట్​నెస్​ అవసరం: మోడీ

స్పోర్ట్స్​లోనే కాదు.. డైలీ లైఫ్​లోనూ ఫిట్​నెస్​ అవసరం: మోడీ

జైపూర్: స్పోర్ట్స్​ను కెరీర్​గా ఎంచుకునేలా యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దేశంలో ఆటలను ప్రభుత్వాల వైపు నుంచి కాకుండా అథ్లెట్ల కోణం నుంచి చూడటం మొదలైందని ప్రధాతీ నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఆటలకు సంబంధించి యువతలో ట్యాలెంట్​కు కొదవలేదని, వనరులు లేకపోవడమే అసలు సవాల్​అని మోడీ చెప్పారు. గతంలో ప్రభుత్వాల సాయం లేకపోవడంతో చాలా మంది యువత స్పోర్ట్స్​ను కెరీర్​గా ఎంచుకునేందుకు ముందుకు వచ్చే వారు కాదని, ఇలాంటి సమస్యలను తమ ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. 2014 నుంచి స్పోర్ట్స్ మినిస్ట్రీకి ఇచ్చే బడ్జెట్​ మూడింతలు పెరిగిందని మోడీ చెప్పారు. స్పోర్ట్స్​ ఫీల్డ్​లో ఉన్న వాళ్లు మాత్రమే ఫిట్​నెస్​పై దృష్టి పెట్టడం కాకుండా.. రోజువారీ జీవితంలో కూడా ఫిట్​నెస్​కు ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ సూచించారు. మనం ఫిట్​గా ఉంటేనే సూపర్​హిట్​అవుతామన్నారు. జైపూర్​లో కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఏర్పాటు చేసిన ‘జైపూర్ మహాఖేల్’ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.

ప్రోత్సాహం ఉంటే చాలు..

‘‘పైసలు లేక యువత వెనుకబడకూడదనే మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఏటా రూ.5 లక్షలు అందజేస్తోంది. యువత సాధించలేనిది అంటూ ఏదీ లేదు. తమ సామర్థ్యాన్ని వారు గుర్తించినప్పుడు, వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించినప్పుడు ప్రతి లక్ష్యం చాలా తేలిక​అయిపోతుంది”అని మోడీ చెప్పారు. ఒకే ఫీల్డ్​కు పరిమితం కావొద్దని, అనేక రంగాల్లో సామర్థ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ మినిస్ట్రీకి 2014కు ముందు కేంద్ర బడ్జెట్​లో రూ.800 కోట్లు కేటాయించాయని, తాము ఈ ఏడాది రూ.2,500 కోట్లు అలాట్​ చేశామన్నారు. ఖేలో ఇండియా ప్రచారానికే రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించామని, వీటిని దేశంలో క్రీడా సౌకర్యాలు, వనరుల అభివృద్ధికి ఖర్చుచేస్తామని  చెప్పారు.