భారత్ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే : ప్రధాని మోదీ

భారత్ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే : ప్రధాని మోదీ
  • ఎలాంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించే సత్తా మనకుంది: ప్రధాని మోదీ
  • కాంగ్రెస్ హయాంలో భారత్​ ప్రపంచ దేశాల సాయం కోరింది
  • బీజేపీ పాలనలో ప్రపంచానికే ఔషధాలను అందించింది
  • యూపీలోని పిలిభిత్​, ఎంపీలోని బాలాఘాట్​లో బీజేపీ ప్రచారం


పిలిభిత్​: భారత్​ తలచుకుంటే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగలదని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ గా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ కు​ ఏదీ అసాధ్యం కాదని ప్రపంచానికి నిరూపించిందని చెప్పారు. భారత్​ ఘనతను మోదీ మరోసారి చాటిచెప్పారు.  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఆయన ఉత్తరప్రదేశ్​లోని పిలిభిత్​లో నిర్వహించిన బీజేపీ ర్యాలీకి హాజరై, ప్రసంగించారు. ‘లక్ష్యం ఎంత కఠినంగానైనా ఉండనీ..భారత్​ దాన్ని అంకితభావంతో కచ్చితంగా సాధిస్తుంది. ఈ స్ఫూర్తి, శక్తితో మనమందరం అభివృద్ధి చెందిన భారత్​ కోసం కృషిచేస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ఇదంతా ప్రజల ఓటు బలంతోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్​ హయాంలో భారత్​ ప్రపంచ దేశాల సాయం కోరిందనీ, కానీ బీజేపీ హయాంలో కొవిడ్​ సమయంలో ప్రపంచ దేశాలకే ఔషధాలను అందించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. 

దేశం బాగుపడితే మనకే గర్వకారణం కాదా?

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే పౌరులందరికీ గర్వకారణం కాదా? అని మోదీ ప్రశ్నించారు. ‘మన దేశం ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు మీరు గర్వించారా?  లేదా?.. చంద్రుడిపై మన చంద్రయాన్​ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినప్పుడు మీరు గర్వించారా? లేదా?.. జీ 20 శిఖరాగ్ర సదస్సును భారత్​ విజయవంతంగా నిర్వహించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి’ అని అన్నారు. దేశం బలంగా ఉంటేనే ప్రపంచం దాని మాట వింటుందని చెప్పారు. అందుకు భారత్​ను శక్తిమంతమైన దేశంగా మార్చేందుకు సహకరించాలని మోదీ ప్రజలను కోరారు.  

దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నరు..

ప్రతిపక్ష ఇండియా కూటమి తనను తిడుతూ.. బెదిరిస్తూ దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నదని ప్రధాని మోదీ అన్నారు. తాను అవినీతిపరులను దేశం నుంచి ఏరివేయాలని పనిచేస్తుంటే.. అవినీతిపరులను రక్షించేందుకు ఇండియా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని బాలాఘాట్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. ఈ లోక్​సభ ఎన్నికలు నయా భారత్​ను నిర్మించేందుకు మిషన్​అని, ఎన్డీఏ థర్డ్​ టర్మ్​లో గొప్ప, చారిత్రక నిర్ణయాలు తీసుకునేందుకు దేశ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నామని అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో బీజేపీకి ఓట్లు వేసి, అన్ని 
పోలింగ్​ రికార్డులను బద్దలు కొట్టాలని కోరారు.

గొప్ప వ్యక్తులను ‘ఇండియా కూటమి’ అవమానిస్తోంది..

దేశమంతా కీర్తించే గొప్ప వ్యక్తులను ఇండియా కూటమి అవమానిస్తోందని మోదీ దుయ్యబట్టారు. ఇంతవరకూ కాంగ్రెస్​, ఎస్పీ నేతలు సర్దార్​ వల్లభ్​ భాయ్​ పటేల్​ విగ్రహాన్ని సందర్శించలేదని, ఆ మహనీయుడికి నివాళులర్పించలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్​, ఎస్పీ నేతలకు విదేశాల్లో సెలవుల ను ఎంజాయ్​ చేసేందుకు టైం ఉంటుంది. కానీ.. పటేల్​ విగ్రహాన్ని సందర్శించేందుకు సమయం ఉండదు. దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిని వారు బాయ్​కాట్​ చేశారు’ అని మోదీ విమర్శించారు. భారత్​ను విభజించేందుకు కుట్ర పన్నుతున్న ఇండియా కూటమినుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని చురకలంటించారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు బీజేపీ మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నదని, వరుణ్​ గాంధీ స్థానంలో జితిన్​ ప్రసాదను ఎంపీ బరిలో నిలిపిందని తెలిపారు. జితిన్​ను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.