
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో సహా 10 మంది నక్సలైట్లు మృతి చెందారు. రాయ్‌పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా ఎన్ కౌంటర్ వివరాలను వెల్లడించారు.
గరియాబంద్ జిల్లాలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో భద్రతా దళాలు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. బలగాల కాల్పుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో సహా 10 మంది నక్సలైట్లు మృతి చెందారని చెప్పారు.
స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) -సీఆర్పీఎఫ్, ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఘటన స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులున్నా విషయం తెలిసిందే.
గడిచిన నాలుగైదు నెలల్లోనే దాదాపు 400 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లో హతమయ్యారు. ఇందులో పార్టీ అగ్ర నేతలు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ భాస్కర్, సుధాకర్, చలపతి వంటి అగ్ర నాయకులు కూడా ఎన్ కౌంటర్లో మృతి చెందారు. నంబాల కేశరావు స్థానంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఎంపికైనట్లు పార్టీ వర్గాల సమాచారం.