- పీఎల్ఐ స్కీములతో ఎంతో మేలు
భువనేశ్వర్: అంతరిక్షం, సెమీకండక్టర్ల తయారీ, ఈవీల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ గత ప్రభుత్వాలతో పోలిస్తే అత్యుత్తమమని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రొడక్షన్ లింక్డ్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకాలు మరింత ఉపాధిని సృష్టించేందుకు సహాయపడ్డాయని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో తగినంత ఉద్యోగాలను సృష్టించడం లేదనే విమర్శలపై స్పందిస్తూ ప్రభుత్వ రంగంలో పెద్ద సంఖ్యలో నియామకాలు జరిగాయన్నారు. గత ఏడాది కాలంలోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రిక్రూట్‌మెంట్ల కోసం లక్షల్లో లెటర్లు ఇచ్చామని, ప్రైవేట్ రంగం వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం వల్ల భారీ ఎత్తున ఉపాధి సాధ్యమయిందని ప్రధాని చెప్పారు.
"గత 10 సంవత్సరాలలో మా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లను 2014లో 134వ ర్యాంక్ నుంచి 2024లో 63వ స్థానానికి మెరుగుపరుచుకున్నాం. మనదేశంలో ప్రైవేట్ రంగం వ్యాపారం చేయడాన్ని ఎంతో సులభంగా మార్చాం. దీనివల్ల వాళ్లు భారీ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగలిగారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం వివిధ రంగాలకు పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది”అని ఆయన వివరించారు.
రికార్డు స్థాయిలో ఫోన్ల ఎగుమతులు
‘‘2014లో, భారతదేశంలో అమ్ముడైన మొబైల్ ఫోన్లలో 78 శాతం దిగుమతి అయ్యాయి. ఇప్పుడు భారతదేశంలో అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్‌లలో 99 శాతానికి పైగా 'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్లే! మనం ఇప్పుడు మొబైల్ ఫోన్‌లను ఎగుమతితో మొదటిస్థానంలో ఉన్నాం. అంతేగాక ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా ఆవిర్భవించాం. మా ప్రభుత్వం 107 యునికార్న్‌లకు, 1.26 లక్షల స్టార్టప్‌లకు సాయం చేసింది.
అంతేగాక 10 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. టైర్-2, టైర్-3 నగరాల నుంచి కొత్త స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా ఉపాధి అవకాశాలు చాలా రెట్లు పెరిగాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోంది. రక్షణ, ఉత్పత్తి, టెక్ స్టార్టప్‌లు సైబర్‌సెక్యూరిటీ వంటివన్నీ విపరీతమైన వృద్ధిని సాధించాయి”అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. మౌలిక సదుపాయాలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని మోదీ చెప్పారు.
