మళ్లీ మేమే గెలుస్తం .. ఈసారి 400 సీట్లు సాధిస్తం : మోదీ  

మళ్లీ మేమే గెలుస్తం .. ఈసారి 400 సీట్లు సాధిస్తం : మోదీ  
  • మూడో టర్మ్​లో మరింత అభివృద్ధి చేస్తం

న్యూఢిల్లీ : మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఈసారి 400 సీట్లు సాధిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆయన వరుసగా పోస్టులు పెట్టారు. ‘‘ఎన్నికల పండగొచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ డేట్స్ ప్రకటించింది. ఎన్నికలకు మేం (బీజేపీ–ఎన్డీయే) సిద్ధంగా ఉన్నాం” అని మోదీ పోస్టు పెట్టారు. దీనికి ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ సర్కార్)’ అనే హాష్ ట్యాగ్ జోడించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పేదరికం, అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని చెప్పారు.

మూడో టర్మ్​లో ఎన్నో పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ప్రతిపక్ష ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. ‘‘దేశాన్ని 70 ఏండ్లు పాలించినోళ్లు అభివృద్ధిని మరిచారు. అన్ని రంగాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. మేం ఈ పదేండ్లలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. అవినీతి అనేదే లేకుండా చేశాం. కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినం.

మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వ్యవస్థగా నిలబెట్టినం. ఇప్పుడు దాన్ని మూడో స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నం. ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నం” అని తెలిపారు. ‘‘వాళ్లెప్పుడూ(ఇండియా కూటమి) మమ్మల్ని తిడుతూనే ఉంటారు. కుటుంబ పాలన చేస్తూ సమాజాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రజలు అలాంటి నాయకత్వాన్ని కోరుకోవడం లేదు” అని అన్నారు.

సోలార్ స్కీమ్​కు కోటి మంది.. 

రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ కోసం ఇప్పటికే కోటి మందికి పైగా అప్లై చేసుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నుంచి 5 లక్షలకు పైగా చొప్పున అప్లికేషన్లు వచ్చాయి” అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.