వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం

వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం
  • పార్టీ ఎంపీలతో ప్రధాని మోడీ 

న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాటికి బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. పార్టీలో వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ నేతలు మోడీ, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోడీ  మాట్లాడారు. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది పార్టీ ఎంపీలు, లీడర్లు తమ పిల్లల కోసం టికెట్లు అడిగారు. అయితే వారిలో చాలామందికి టికెట్లు ఇవ్వలేదు. వాళ్లకు టికెట్లు రాకపోవడానికి కారణం నేనే. అలా టికెట్లు ఇస్తే, అది వారసత్వ రాజకీయాల కిందకు వస్తుంది. దానికి మన పార్టీ వ్యతిరేకం. అందుకే టికెట్లు ఇవ్వలేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లందరినీ భద్రంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని, నిజానిజాలు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల ఎంపీలకు ఈ సందర్భంగా ఓ పని అప్పగించారు. తమ నియోజకవర్గంలో బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చిన 100 పోలింగ్ బూత్ లను గుర్తించి, అందుకు గల కారణాలేంటో తెలుసుకోవాలని సూచించారు. మీటింగ్ తర్వాత పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమైన వాతావరణం నెలకొంది. ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలి. అందుకే పార్టీ లీడర్ల పిల్లలకు టికెట్లు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నాం” అని మోడీ చెప్పారన్నారు. ప్రధాని నిర్ణయాన్ని అందరూ ఆమోదించారని చెప్పారు.

కాశ్మీర్ ఫైల్స్​కు మెచ్చుకోలు..
‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ మూవీ బాగుందని మోడీ మెచ్చుకున్నారు. నిజాలను బయట కు తీసుకొచ్చిందని చెప్పారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుం టున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమా ను తప్పుగా చూపేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని మోడీ మండిపడ్డారు.