మోడీ పైసలవి.. వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు

V6 Velugu Posted on Sep 15, 2021

పాట్నా: డబ్బులు ఒకరి ఖాతాకు వేయబోయి మరొకరి అకౌంట్‌లో వేయడం చూస్తుంటాం. ఒక్కోసారి బ్యాంకులు కూడా ఇలాంటి తప్పులు చేస్తుంటాయి. అయితే ఇక్కడో గమ్మత్తయిన ఘటన జరిగింది. బిహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్‌కు గ్రామీణ్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఈ ఏడాది మార్చిలో దాస్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అయితే అది బ్యాంకు తప్పిదం వల్ల జరిగింది. దీంతో ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు రంజిత్ దాస్‌ను కోరారు. కానీ దీనికి అతడు తిరస్కరించాడు. ఆ డబ్బులు తనకు ప్రధాని మోడీ పంపారని, తిరిగి ఇవ్వనని మొండికేశాడు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంజిత్ దాస్ అరెస్ట్ అయ్యాడు. 

అరెస్ట్ అనంతరం పోలీసు స్టేట్‌మెంట్ సమయంలో రంజిత్ దాస్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది మార్చిలో నా బ్యాంకు అకౌంట్‌లో లక్షల మొత్తంలో డబ్బులు జమవ్వగానే చాలా సంతోషించా. అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగానే తొలి విడతగా ఆ డబ్బులు నాకు పంపారేమోనని భావించా. అలా ఆ డబ్బును ఖర్చు చేసేశా. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు’ అని వాపోయాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు రంజిత్ దాస్‌ను అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని మాన్సి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు. 

Tagged pm modi, bihar, Banks, money, one arrested

Latest Videos

Subscribe Now

More News