గత ప్రభుత్వాల పనితీరుపై ప్రధాని మోడీ విమర్శలు

గత ప్రభుత్వాల పనితీరుపై ప్రధాని మోడీ విమర్శలు
  • గత ప్రభుత్వల పనితీరుపై ప్రధాని మోడీ విమర్శలు
  • రాజస్థాన్​లో తొలి వందేభారత్​రైలు ప్రారంభం
  • హాజరైన సీఎం అశోక్​ గెహ్లాట్​

జైపూర్: దేశంలో గత ప్రభుత్వాలన్నీ రైల్వే రంగాన్ని రాజకీయ వేదికగా మార్చాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. స్వార్థపూరిత, నీచ రాజకీయాలు రైల్వే రంగాన్ని అభివృద్ధి చెందకుండా చేశాయని అన్నారు. ఇది మన దేశ దురదృష్టమంటూ విచారం వ్యక్తంచేశారు. వందేండ్లుగా ఉన్న డిమాండ్లను తాము అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తున్నామని చెప్పారు. బుధవారం రాజస్థాన్​లో తొలి, దేశంలో 14వ వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించి మాట్లాడారు. బడ్జెట్​లో ప్రస్తావించిన ఎన్నో రైళ్లు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రూపం దాల్చలేదన్నారు. రైల్వే రిక్రూట్​మెంట్లు కూడా అవినీతిమయం అయ్యాయని ప్రధాని ఆరోపించారు. 2014 తర్వాత దేశంలో పరిస్థితులు మారాయని, రాజకీయ బేరసారాలు, ఒత్తిళ్లు తొలగిపోయాయని చెప్పారు. రైల్వే రంగం అద్భుతంగా డెవలప్ అయిందన్నారు.

గెహ్లాట్​కు ప్రత్యేక కృతజ్ఞతలు

వందే భారత్ రైలు లాంచ్ ఈవెంట్​ను జైపూర్ జంక్షన్​లో ఏర్పాటు చేయగా.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాజస్థాన్ గవర్నర్​ కల్రాజ్ మిశ్రాతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్​కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం మోడీ గెహ్లాట్​పై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్​పార్టీలో అంతర్గత సంక్షోభం ఉన్నప్పటికీ వందే భారత్ లాంచింగ్​కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు జిల్లాల ప్రధాన కార్యాలయాలగుండా రైల్వే లింక్ వేయాలని అంతకుముందు గెహ్లాట్ చేసిన విజ్ఞప్తిపై మోడీ స్పందిస్తూ.. ‘‘ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే జరగాల్సిన పనులు ఇప్పటిదాకా జరగలేదు. కానీ, నాపై ఎంతో నమ్మకం ఉంచి ఈ రోజు ఆ పనిని నాకు అప్పగించారు. నా మీద మీకున్న నమ్మకమే మన స్నేహానికి బలం” అని అన్నారు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్​కూడా రాజస్థాన్​కు చెందినవారేనంటూ ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు. కాగా, 2014కు ముందున్న రైల్వే మంత్రులంతా అవినీతిపరులేనని ప్రధాని నిర్ణయించడం దురదృష్టకరమని సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. మాజీ రైల్వే మంత్రులందరినీ అవమానించారని మండిపడ్డారు.