జనంలోకి వెళ్లి..ప్రజలకు అండగా ఉండండి

జనంలోకి వెళ్లి..ప్రజలకు అండగా ఉండండి

రాష్ట్రంలో అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బీజేపీ కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. తాను కూడా బీజేపీలో చిన్న కార్యకర్తనేనని పేర్కొన్నారు. ‘‘కేంద్రం అందించే సంక్షేమ పథకాలను ఇక్కడి ప్రజలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది. రాష్ట్రంలో బూత్​ లెవల్​ వరకు వెళ్లి.. ఎవరికైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందడంలేదో వాళ్లకు సాయం చేయండి. అండగా ఉండండి. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని తిడితేనే తెలంగాణ ప్రజలు, రైతులు బాగుపడుతారంటే ఎన్ని తిట్లయినా తినడానికి ముందుండాలన్నారు. ‘‘తెలంగాణ ప్రజలు పాజిటివిటీని కోరుకుంటున్నారు.. అభివృద్ధిని కోరుకుంటున్నారు.. అది బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టండి”అని మోడీ సూచించారు. 

కేసీఆర్ కు ముఖం లేదు..  

ప్రధాని మోడీ ముందు నిలబడడానికి సీఎం కేసీఆర్ కు ముఖం లేదు. ఇది ఎలక్షన్స్ టైమ్ కాదు. హామీలు ఇచ్చేందుకు చాలా టైమ్ ఉంది. ప్రధానిని విమర్శించే అర్హత కాంగ్రెస్ లేదు. ఫ్యాక్టరీని కాంగ్రెస్ హయాంలో పూర్తి చేస్తే ఎందుకు ఓపెన్ చేయలేదు. 
–డీకే అరుణ, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ 

కేసీఆర్ కు ప్రొటోకాల్ తెలియదా? 

సీఎం కేసీఆర్ కు ప్రొటోకాల్ తెలియదా? ప్రధాని వస్తుంటే స్వాగతం పలకరా? రైతుల కోసం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేసేందుకు మోడీ వస్తే, హైదరాబాద్ లో ‘‘మోడీ గో బ్యాక్’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి పథకం కేంద్ర సాయంతోనే అమలవుతోంది. 
–జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ