ప్రధాని స్టాక్ టిప్స్‌‌‌‌.. ప్రభుత్వ కంపెనీల షేర్లు జూమ్‌‌‌‌

ప్రధాని స్టాక్ టిప్స్‌‌‌‌.. ప్రభుత్వ కంపెనీల షేర్లు జూమ్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశ ప్రధానే స్వయంగా స్టాక్ టిప్స్‌‌‌‌ ఇవ్వడం చాలా అరుదు. ఇలాంటి సంఘటనే  తాజాగా జరిగింది. ప్రభుత్వ కంపెనీల్లో ఇన్వెస్టర్లు ఎటువంటి భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చని  ప్రధాని మోదీ గురువారం పార్లమెంట్‌‌‌‌లో పేర్కొన్నారు. దీంతో పీఎస్‌‌‌‌యూ షేర్లు శుక్రవారం సెషన్‌‌‌‌లో 14 శాతం వరకు ర్యాలీ చేశాయి. మొత్తం మార్కెట్‌‌‌‌ నెగెటెవ్‌‌‌‌లో ట్రేడయినప్పటికీ  నిఫ్టీ పీఎస్‌‌‌‌యూ బ్యాంక్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ 1.25 శాతం లాభపడింది. ఇదే టైమ్‌‌‌‌లో నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌‌‌‌లు అర శాతానికి పైగా నష్టపోయాయి. ఇండియన్ ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్ బ్యాంక్‌‌‌‌ షేర్లు ఎక్కువగా అంటే 14 శాతం పెరిగాయి. కంపెనీ బాండ్లకు ఏ+ రేటింగ్‌‌‌‌ను కేర్ రేటింగ్స్ ఇవ్వడం కూడా షేర్ల ర్యాలీకి ఒక కారణం.   సెంట్రల్ బ్యాంక్‌‌‌‌, యూకో బ్యాంక్ షేర్లు 5–7 శాతం వరకు ర్యాలీ చేశాయి. లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌‌‌‌ఐసీ) షేర్లు కూడా ఇంట్రాడేలో 6 శాతం వరకు  పెరిగాయి.  

కంపెనీ లాభం ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో భారీగా పెరగడం కూడా ఇందుకు కారణం. ‘ఎల్‌‌‌‌ఐసీ పని అయిపోయిందని చాలా మంది అన్నారు. కష్టపడి సంపాదించి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారి డబ్బులు పోతాయని చెప్పారు. వారికి ఏం అనిపిస్తే అది అన్నారు. కానీ, ఎల్‌‌‌‌ఐసీ నిలకడగా బలపడుతోంది’ అని నో కాన్ఫిడెన్స్ మోషన్‌‌‌‌కు రిప్లైగా పార్లమెంట్‌‌‌‌లో  ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇతరులు వద్దన్న ప్రభుత్వ కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వ కంపెనీలు బాగా పనిచేస్తాయని ప్రధానే అంత కాన్ఫిడెంట్‌‌‌‌గా ఇన్వెస్టర్లకు చెప్పడం ఇదే మొదటిసారి అని వెల్త్‌‌‌‌మిల్స్‌‌‌‌ సెక్యూరిటీస్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ క్రాంతి బాథిని అన్నారు. కాగా, ప్రభుత్వ బ్యాంకుల సామర్ధ్యాన్ని కొలిచే పీఎస్‌‌‌‌యూ బ్యాంక్ ఇండెక్స్ గత 12 నెలల్లో 60 శాతం పెరిగింది. ఇదే టైమ్‌‌‌‌లో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కేవలం 15 శాతమే లాభపడింది. 

మార్కెట్ డౌన్‌‌‌‌..

బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా రెండో సెషన్‌‌‌‌లో కూడా నష్టాల్లో కదిలాయి.  ప్రైవేట్ బ్యాంక్‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, ఐటీ షేర్లు పడడంతో నిఫ్టీ115 పాయింట్లు (0.59 శాతం)  తగ్గి 19,428 దగ్గర  ముగిసింది. బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌ 365 పాయింట్లు పడి 65,322 దగ్గర సెటిలయ్యింది. సెక్టార్ వైజ్‌‌‌‌గా చూస్తే బ్యాంక్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, ఫార్మా, మెటల్‌‌‌‌, ఐటీ సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌లు నష్టాల్లో క్లోజయ్యాయి. నిఫ్టీ మిడ్‌‌‌‌క్యాప్‌‌‌‌100 ఇండెక్స్‌‌‌‌ 0.43 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్100 ఇండెక్స్ 0.18 శాతం పడ్డాయి. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచడంతో గత రెండు సెషన్లుగా మార్కెట్ పడుతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు.