గడచిన కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలోని అనేక కంపెనీలు ఉద్యోగులను వరుసగా లేఆఫ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది టెక్కీల్లో లేఆఫ్ యాంగ్జైటీ విపరీతంగా పెరిగిపోతోంది. ఆఫీసులో లేకపోతే లేదా రోజూ కనిపించకపోతే తమకు ప్రధాన్యత తగ్గుతుందని.. ఆ తర్వాత లేఆఫ్ లిస్టులో తమ పేరు కూడా చేరుతుందనే జాబ్ ఇన్ సెక్యూరిటీ భయాలు లక్షల మంది టెక్కీలను వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ కుదిరినంత వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం అందించాలని సూచించటం చాలా మంది టెక్కీలకు మింగుడుపడటం లేదు.
ఆఫీసులకు వెళితేనే జాబ్ ఎప్పుడు పోతుందో ఏ సమయంలో ఇక మీ సేవలు కంపనీకి అక్కర్లేదంటూ మెయిల్స్ వస్తాయో అని భయపడుతూ రోజులు గడుపుతున్న చాలా మంది ఐటీ ఉద్యోగులు.. ఇక ఇంటి దగ్గర నుంచి పనిచేస్తే ఆఫీసులో జరిగే మార్పులు, పరిస్థితుల గురించి అస్సలు తెలియవని ఆందోళన చెందుతున్నారు. అసలే ఇప్పటికే ఓపెన్ లేఆఫ్స్ అలాగే సైలెంట్ లేఆఫ్స్ కారణంగా జాబ్ కోల్పోయిన చాలా మందికి 6 నెలల నుంచి ఏడాది గడుస్తున్న కొత్త ఉద్యోగ అవకాశాలు దొరకటం లేదని ఇలాంటి వాతావరణంలో తమ జాబ్ పోతే పరిస్థితి ఏంటనే భయం ఐటీ ఉద్యోగులను నీడలా వెంటాడుతోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్‌పై కంపెనీల టెన్షన్..
రోజుకో ఏఐ టెక్నాలజీ పుట్టుకొస్తూ తమ మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్న వేళ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయమనటం రిస్క్ అని చాలా ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. ఉన్న ప్రాజెక్టులు, క్లయింట్లను పోకుండా ప్రస్తుతం ఉన్న పోటీలో తక్కువ మార్జిన్లతో బిజినెస్ కొనసాగించటం ఛాలెంజ్ గా మారిందని ఈ క్రమంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వారి పనితీరును ట్రాక్ చేయటం కష్టం అవుతుందని కంపెనీలు అంటున్నాయి.
అలాగే గతంలో కరోనా మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాక ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రామని టెక్ సంస్థలను ముప్పుతిప్పలు పెట్టిన ఘటనలను వారు ఇప్పటికీ మరచిపోవటం లేదు. చాలా కష్టపడి గత 3 ఏళ్లుగా ఉద్యోగులను హైబ్రిడ్ వర్క్ విధానానికి మార్చగలిగామని కొన్ని కంపెనీలు అంటుంటే టీసీఎస్ లాంటి కంపెనీలు మాత్రం వారంలో 5 రోజులు ఆఫీసులు వచ్చి పనిచేయాలని రూల్స్ తీసుకొచ్చాయి. ఇప్పుడిప్పుడే అంతా సాఫీగా నడుస్తుందని అనుకుంటుంటే మళ్లీ ప్రధాని మాట విని రిమోట్ వర్క్ విధానానికి మారితే బిజినెస్ అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉందని ఐటీ కంపెనీల సీఈఓలు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి అటు కంపెనీలతో పాటు ఇటు ఉద్యోగుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే హ్యాపీనెస్ కంటే భయమే కనిపిస్తోంది.
