ట్రంప్​కు మోడీ ఫోన్  

ట్రంప్​కు మోడీ ఫోన్  

న్యూఢిల్లీ: సౌత్​ ఏషియా రీజియన్​లో శాంతి నెలకొల్పే విషయంలో ఇండియా ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అమెరికా ప్రెసిండెంట్​ డోనాల్డ్​ ట్రంప్​కు సోమవారం ఫోన్​చేసి మాట్లాడిన ఆయన.. రీజియన్​లో ఇండియాకు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు అంతర్జాతీయ వేదికలపై వాక్​చాతుర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటోళ్లవల్ల శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతున్నదని, క్రాస్​బోర్డర్ టెర్రరిజాన్నీ అణిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాకిస్తాన్​ పీఎం ఇమ్రాన్​ ఖాన్​ను ఉద్దేశించి మోడీ ఈ కామెంట్లు చేశారు. 30 నిమిషాల పాటు సాగిన సంభాషణలో ద్వైపాక్షిక అంశాలతోపాటు సౌత్​ ఏషియా వ్యవహారాలపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

సోమవారం 100వ స్వాంత్ర్యదినోత్సవాన్ని జరుపుకొంటున్న ఆఫ్ఘనిస్తాన్​​ను ప్రస్తావిస్తూ.. ఆఫ్ఘన్ పూర్తిస్థాయి  ప్రజాస్వామిక దేశంగా ఎదిగేందుకు ఇండియా తన వంతు సహకారం అందిస్తుందని మోడీ పునరుద్ఘాటించారు. అలాగే దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధుల నిర్మూల కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్నీ వివరించారు. ఆర్టికల్​ 370ని రద్దుచేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయంపై యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో శనివారం చర్చ జరగడానికి కొద్దిగంటల ముందు ట్రంప్​కు ఫోన్​చేసి పాక్​ పీఎం ఇమ్రాన్​ తన గోడు వెళ్లబోసుకున్నారు. కాశ్మీర్​పై జోక్యం చేసుకునేందుకు చైనా తప్ప సెక్యూరిటీ కౌన్సిల్​లోని ఇతర దేశాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్​కు మోడీ ఫోన్​కాల్​ ప్రాధాన్యం సంతరించుకుంది. కాశ్మీర్​ ఇండియా అంతర్గత వ్యవహారమని మోడీ క్లారిటీ ఇచ్చారు.

22 నుంచి మోడీ విదేశీ టూర్లు 

ఫ్రాన్స్​తోపాటు రెండు మిడిల్​ ఈస్ట్​ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్​ ఖరారైంది. ఈ నెల 22న ప్యారిస్​కు వెళ్లనున్న మోడీ.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ తో డిఫెన్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఇతర అంశాల్లో  సహకారంపై చర్చలు జరుపుతారు. అటునుంచటే 23న యూఏఈలో అడుగుపెట్టనున్న మోడీ, 24న బహ్రెయిన్​​కు చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది.  యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం‘ఆర్డర్​ ఆఫ్​ జయేద్​’ను మోడీ స్వీకరిస్తారని, దుబాయ్​ క్రౌన్స్​ప్రిన్స్​తోనూ ప్రధాని సమావేశం కానున్నారని అధికారులు చెప్పారు. బెహ్రెయిన్​లో ఇండియా ప్రధాని పర్యటించడం చరిత్రలో ఇదే తొలిసారి.