ఓ వ్యక్తికి ప్రధాని పదవి కోసం దేశాన్ని విభజించారు

ఓ వ్యక్తికి ప్రధాని పదవి కోసం దేశాన్ని విభజించారు

భారత దేశ విభజన జరగడానికి ప్రధానమంత్రి పదవిపై ఓ వ్యక్తి కోరికేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ఆయన ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ తొలి ప్రధాని జిన్నాల పేర్లు ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి ప్రధాని కావడం కోసం దేశంలో విభజన రేఖ గీయాల్సి వచ్చిందని అన్నారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకొని నవ భారత నిర్మాణంలో ముందుకు వెళ్లాలనుకుంటోందని చెప్పారు మోడీ. కాంగ్రెస్ తరహాలో పాలించి ఉంటే దేశంలో మార్పు సాధ్యం కాదని, ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న రామ జన్మ భూమి అంశం, ఆర్టికల్ 370 రద్దు, కర్తార్‌పూర్ కారిడార్, భారత్ – బంగ్లాదేశ్ మధ్య భూభాగ ఒప్పందం లాంటివి జరిగేవి కాదని అన్నారు.

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ విషయంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందంటూ కాంగ్రెస్ ఆరోపించడంపై ప్రధాని మోడీ ఆ పార్టీకి చురకలంటించారు. ఇటీవల కొంతమంది సేవ్ కాన్‌స్టిట్యూషన్ అంటున్నారని, కాంగ్రెస్ ఈ మాట రోజుకు 100 సార్లయినా చెప్పాలని ఎద్దేవా చేశారు. గతంలో ఆ పార్టీ చేసిన తప్పులు ఇప్పుడు గుర్తొచ్చిట్టుందని, ఎమర్జెన్సీ సమయంలో ఈ స్లోగన్ వాళ్లు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.

కాంగ్రెస్.. నెహ్రూను మతతత్వవాదిగా చూపిస్తోందా?

పాకిస్థాన్‌లోని మైనారిటీల హక్కులను కాపాడాలని భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నినదించారని మోడీ చెప్పారు. అందుకు కాంగ్రెస్ ఆయన్ని హిందూ రాజ్యం కోరుకున్నారని చెప్పాలనుకుంటుందా అని ప్రశ్నించారు. నెహ్రూను ఓ మతతత్వవాదిగా చూపించే ప్రయత్నం చేస్తోందా అని ప్రతిపక్షాన్ని నిలదీశారు. సీఏఏ ద్వారా తాము నెహ్రూ కోరుకున్న విధంగా పొరుగు దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు.