‘ఒకేసారి ఎన్నికల’కు మెజార్టీ పార్టీలు ఓకే

‘ఒకేసారి ఎన్నికల’కు మెజార్టీ పార్టీలు ఓకే
  • సాధ్యాసాధ్యాలపై సూచనలిచ్చేందుకు పొలిటికల్ కమిటీ
  • ఏర్పాటుకు ప్రధాని నిర్ణయం
  • ఆల్ పార్టీ మీటింగ్ కు కాంగ్రెస్,ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఎంసీ,డీఎంకే గైర్హా జరు
  • టీఆర్ఎస్, వైసీపీ, జేడీయూ,బీజేడీ, లెఫ్ట్ పార్టీల హాజరు
  • ఒకేసారి ఎన్నికలు జరిగితేనే మేలు: కేటీఆర్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. లోక్​సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎలక్షన్ నిర్వహించేందుకు మెజార్టీ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’కు సంబంధించిన అంశాలపై సూచనలు ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌ వెల్లడించారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఉన్న సాధాసాధ్యాలపై నిర్దిష్ట కాల పరిమితితో ఆ కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. కమిటీలో ఎవరెవరు ఉండాలి? దాని విధివిధానాలేంటి? తదితరాలకు సంబంధించిన వాటిపై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్‌‌ లైబ్రరీ హాలులో ఆల్​పార్టీ మీటింగ్ జరిగింది. సమావేశం తర్వాత వివరాలను రాజ్‌‌నాథ్‌‌ మీడియాకు వెల్లడించారు. మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన మెజారిటీ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు మద్దతు తెలిపాయని చెప్పారు. మోడీ ఏర్పాటు చేయబోయేది ‘పొలిటికల్ కమిటీ’ అని సమాచారం. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ కమిటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అమిత్‌‌ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీకి డుమ్మా కొట్టాయి.

అన్ని పార్టీల‌‌తో చ‌‌ర్చించాకే తుది నిర్ణయం

జ‌‌మిలి ఎన్నిక‌‌లపై దేశంలోని అన్ని రాజ‌‌కీయ పార్టీల‌‌తో చ‌‌ర్చించిన త‌‌ర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామ‌‌ని రాజ్‌‌నాథ్ సింగ్ వెల్లడించారు. ‘‘మేం 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. 21 పార్టీల ప్రెసిడెంట్లు భేటీకి హాజరయ్యారు. మరో మూడు పార్టీలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేశాయి” అని వివరించారు. మొత్తంగా 24 పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మినహా భేటీకి హాజరైన అన్ని పార్టీలు తమ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయని చెప్పారు. ‘‘సీపీఐ, సీపీఎంలకు మా ప్రతిపాదనపై అభిప్రాయ బేధాలు ఉన్నాయి. అంతేకాని ప్రపోజల్​ను వ్యతిరేకించలేదు. అమలు తీరును మాత్రమే వారు వ్యతిరేకించారు” అని ఆయన వివరించారు.

‘‘ఒకదేశం, ఒక ఎలక్షన్ అనేది ప్రభుత్వ ఎజెండా కాదు. దేశం ఎజెండా. ఇందులోకి అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేస్తాం. అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం” అని చెప్పారు. నీటి సంరక్షణ, మహాత్మాగాంధీ 150వ జయంతి నిర్వహణ, 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సెలబ్రేషన్స్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగించడానికి అందరూ అంగీకరించార‌‌న్నారు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు.

‘ఆల్ పార్టీ’ ఆబ్సెంట్

ఆల్ పార్టీ మీటింగ్​కు ప్రధాన ప్రతిపక్షాలు డుమ్మా కొట్టాయి. లోక్​సభ/రాజ్యసభలో కనీసం ఒక్క ఎంపీ ఉన్న ప్రతి పార్టీని ఈ భేటీకి ప్రధాని ఆహ్వానించారు. ఆల్ పార్టీ భేటీలో పాల్గొనాలా? వద్దా? అనే దానిపై మంగళవారం కన్ఫ్యూజన్​లో ఉన్న కాంగ్రెస్.. బుధవారం ఇతర పార్టీలతో చర్చించిన తర్వాత మీటింగ్​కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అంతకుముందు ఉదయం ప్రతిపక్ష పార్టీలతో సమావేశమై జమిలి ఎన్నికలపై చర్చించాలని భావించినా.. రాహుల్ గాంధీ పుట్టిన రోజు నేపథ్యంలో అది రద్దయింది. ఇక తాము మీటింగ్​కు హాజరుకాబోమని తృణముల్ కాంగ్రెస్ మంగళవారమే ప్రకటించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష శివసేన, సమాజ్​వాదీ పార్టీ, బహుజన్ సమాజ్​వాదీ పార్టీ, డీఎంకే, టీడీపీ, తృణముల్ కాంగ్రెస్ తదితర పార్టీలు పాల్గొనలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్​ల తరఫున ప్రతినిధులు హాజరయ్యారు.

ఈవీఎంలపై అయితే ఓకే: మాయావతి

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం) అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము హాజరయ్యే వారిమని బీఎస్పీ చీఫ్‌‌ మాయావతి చెప్పారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఇటీవలి లోక్‌‌సభ ఎన్నికల తర్వాత పూర్తిగా పోయిందన్నారు.

ప్రజాస్వామ్య వ్యతిరేకం: సీపీఎం

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరల్ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజ్యాంగానికి వ్యతిరేకమని సీపీఎం కామెంట్ చేసింది. ఇదో ‘కృత్రిమ ప్రయత్నం’ అని విమర్శించింది. జమిలి ఎన్నికలను నిర్వహించడమంటే.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీయడమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి అన్నారు. ఇందులో సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయన్నారు.

జైకొట్టిన నవీన్

‘ఒక దేశం, ఒక ఎన్నిక’కు ఒడిశా సీఎం నీవన్ పట్నాయక్ జైకొట్టారు. ఈ ప్రతిపాదనకు తన పూర్తి మద్దతు తెలిపారు. ఒకేసారి ఎన్నికలు జరగడమే మేలని, వరుసగా ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం ఇచ్చి పుచ్చుకునే వైఖరిని పాటించాలని సూచించారు

హాజరైంది వీరే..

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్సార్​సీపీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. బీహార్ సీఎం నితీశ్​కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుక్ బీర్ సింగ్ బాదల్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ నేత శరద్‌‌ పవార్, ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే పాల్గొన్నారు.

ఎవరు రాలేదంటే..

కాంగ్రెస్  చీఫ్ రాహుల్ గాంధీ, టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​యాదవ్, డీఎంకీ ప్రెసిడెంట్ స్టాలిన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ హాజరు కాలేదు.

ఏక కాలంలో ఎన్నికలకు పూర్తి మద్దతు: కేటీఆర్

రాష్ట్రాలకు మ రిన్ని హక్కులు ఇవ్వాలని, అధికార వికేంద్రీకరణ తోనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ అభిప్రాయ పడ్డారు . వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక  మెకానిజం ఉండాలన్నారు. ఎన్నికలు పలు దఫాలుగా జరగడం వల్ల పాలనలో ఇబ్బందులు, ఎలక్షన్ కోడ్ పేరుతో ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఇలా తమకు ఎదురైన అనుభవాలను మీటింగ్ లో చెప్పామని వివరించారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే ఏక కాలంలో ఎన్నికలు జరగాలని వివరించినట్టు చెప్పారు . ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే ఒకే సారి ఎన్నికలు జరగాలని చెప్పారు . ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని  చెప్పినట్టు వివరించారు.