ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో రైలు కనెక్టివిటీ

ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో రైలు కనెక్టివిటీ
  • త్వరలో బైరాబి, సాయిరంగ్ రైల్ లైన్  ప్రారంభం
  • రైల్వే బోర్డు మాజీ చైర్మన్  అండ్ సీఈఓ జయవర్మ సిన్హా

న్యూఢిల్లీ: మరో ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో రైలు కనెక్టివిటీ ప్రారంభం కాబోతున్నది. ఈ రాష్ట్రంలోని బైరాబి, సాయిరంగ్  రైల్  లైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. బైరాబి నుంచి సాయిరంగ్  వరకు 51 కిలోమీటర్ల పరిధిలో ఈ రైల్వే లైన్ ను నిర్మించారు. మొత్తం 45 టన్నెల్స్, 55 బ్రిడ్జీలను దాటుతూ అడవుల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ రైలు మార్గం అమల్లోకి వస్తే, మిజోరాం రాజధాని ఐజ్వాల్.. నేషనల్  రైల్వే గ్రిడ్ తో అనుసంధానం అవుతుంది. 

ఈ రైల్వే లైన్ తో ఇక మిజోరాంలో ప్రజల రూపరేఖలు మారనున్నాయని రైల్వే బోర్డు మాజీ చైర్మన్  అండ్ సీఈఓ జయవర్మ సిన్హా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘మిజోరాంలో ఇప్పటివరకూ రైల్వే లైన్  లేకపోవడంతో ప్రజలు కొండప్రాంతాల ద్వారా ప్రయాణించారు. దీంతో ప్రయాణాలు ఖర్చుతో కూడుకోవడంతో పాటు సమయం కూడా చాలా వృధా అయ్యేది. ఒక్కసారి బైరాబి, సాయిరంగ్  రైల్వే లైన్లు ప్రారంభమైతే కోలాసిబ్, ఐజ్వాల్  మధ్య ప్రయాణం సగానికి సగం తగ్గిపోతుంది. అంతేకాకుండా సరుకుల రవాణా కూడా సులభంగా మారుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపార అవకాశాలు పెరుగుతాయి” అని జయవర్మ తెలిపారు. ఆంత్రప్రెన్యూర్లకూ మార్కెట్ లో అవకాశాలు పెరుగుతాయని ఆమె చెప్పారు. మిజోరాంకు ఈ రైల్వే లైన్  కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందన్నారు.