నేడు కాశీకి ప్రధాని మోడీ

నేడు కాశీకి ప్రధాని మోడీ

వారణాసి: ఉత్తరప్రదేశ్​లోని వారణాసి సిటీలో కొత్త సౌలతులతో అభివృద్ధి చేసిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించనున్నారు. ‘‘ప్రధాని ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వారణాసి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి కాళ భైరవ మందిరాన్ని దర్శించుకుంటారు. తర్వాత నదిలో ప్రయాణిస్తూ విశ్వనాథుడి ఆలయ సమీపంలోని ఘాట్​కు చేరుకుంటారు. మధ్యాహ్నం విశ్వనాథుడిని దర్శించుకుని, కారిడార్ ప్రారంభిస్తారు” అని పీఎంవో వెల్లడించింది. ఇంతకుముందు కాశీ విశ్వనాథుడి దేవాలయం చుట్టూ 3 వేల చదరపు అడుగుల స్థలం మాత్రమే ఆలయ పరిధిలో ఉండగా, దీనిని 5 లక్షల చదరపు అడుగులకు పెంచి భక్తులు, టూరిస్టులకు సౌలతులను ఏర్పాటు చేశారు. దేవాలయం నలువైపులా పురాతన ఆర్కిటెక్చర్​తో గేట్ వేలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఇందుకోసం 1400 షాపులు, ఇండ్లను సేకరించి, వాటి ఓనర్లకు వేరే చోట పునరావాసం కల్పించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ గెస్ట్ హౌస్​లు, వేదిక్ కేంద్రం, మ్యూజియం, సందర్శకుల గ్యాలరీ, ఫుడ్ కోర్టు వంటి 23 బిల్డింగులు కట్టారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో టూరిజం మరింత పెరిగేలా ఈ ప్రాజెక్టుకు ఆయన 2019 మార్చిలో శంకుస్థాపన చేశారు. కాశీ విశ్వనాథుడి ఆలయం నుంచి గంగా నదిలోని లలితా ఘాట్​కు ఈజీగా చేరుకునేలా మార్పులు చేశారు. కారిడార్​ను ప్రారంభించాక మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో క్రూయిజ్ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు.