16, 17 తేదీల్లో సీఎంల‌తో మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌: రెండో రోజు తెలంగాణ‌ సీఎం..

16, 17 తేదీల్లో సీఎంల‌తో మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌: రెండో రోజు తెలంగాణ‌ సీఎం..

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప‌రిస్థితులు, దాని కట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రోసారి అన్ని రాష్ట్రాల సీఎంల‌తో చ‌ర్చించ‌బోతున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర‌పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌బోతున్నారు. తొలి రోజు 21, రెండో రోజు 15 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడ‌నున్నారు మోడీ. మొద‌టి రోజు క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొంత‌మేర కంట్రోల్‌లో ఉండి, కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

పంజాబ్, అస్సాం, కేర‌ళ‌, ఉత్త‌రాఖండ్, జార్ఖండ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్, త్రిపుర‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్, చండీగ‌ఢ్, గోవా, మ‌ణిపూర్, నాగాలాండ్, ల‌ఢ‌ఖ్, పుదుచ్చేరి, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్, ల‌క్ష‌ద్వీప్, సిక్కిం, దాదర్ న‌గ‌ర్ హ‌వేలీ & డామ‌న్ డ‌య్యూ, అండమాన్ నికోబార్, మిజోరం, మేఘాల‌య ప్ర‌భుత్వాధినేత‌ల‌తో 16న ప్ర‌ధాని మోడీ స‌మీక్ష నిర్వ‌హిస్తారు.

రెండో రోజైన 17వ తేదీన క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ తెలంగాణ స‌హా ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఒడిశా, జ‌మ్ము క‌శ్మీర్, హ‌ర్యానా, బీహార్, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, గుజ‌రాత్, ఢిల్లీ, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడుతారు.

క‌రోనా లాక్‌డౌన్ ఆంక్ష‌ల్లో భారీగా ఇటీవ‌ల స‌డ‌లింపులు ఇచ్చిన నేప‌థ్యంలో రాష్ట్రాల్లో తాజా ప‌రిస్థితులపై ప్ర‌ధాని చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ స్ట్రాట‌జీ విష‌యంలో ఏమైనా మార్పులు చేర్పులూ చేయాలా అన్న దానిపై, క‌రోనా కేసులు ఇటీవ‌ల ఎక్కువ సంఖ్య‌లో న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై స‌మీక్షించ‌నున్న‌ట్లు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.