కరోనా భయం.. ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకకు కొంతమందికే ఆహ్వానం?

కరోనా భయం.. ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకకు కొంతమందికే ఆహ్వానం?

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ స్వాతంత్ర్య పోరాట యోధులను అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ యేడు పంద్రాగస్టు వేడుకలు విభిన్నంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మహమ్మారి వ్యాప్తి వేగంగా అవుతుండటం, కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తల మధ్య సంబురాలు జరుపనున్నట్లు సమాచారం. దేశ రాజధానిలోని ఎర్రకోటలో పలు జాగ్రత్తల మధ్య, తక్కువ మంది అతిథుల నడుమ నిరాడంబరంగా ప్రధాని మోడీ జెండా ఎగరవేయనున్నారని తెలిసింది. ఈసారి స్కూల్ పిల్లలు పెర్ఫామెన్స్‌లు కూడా ఉండవని తెలిసింది. దీని స్థానంలో 300 ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు ఆహ్వానం పలికారని సమాచారం.

ఎర్రకోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా అమలు చేయనున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే మొత్తం స్టాఫ్ పీపీఈ కిట్స్‌తో అటెండ్ అవనున్నారని తెలిసింది. ప్రతి సంవత్సరం ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు 900–1,000 మందిని ఇన్వైట్ చేస్తారు. ఈసారి మాత్రం కేవలం 200–250 మందికే ఆహ్వానాలు పంపనున్నారని సమాచారం.

‘ప్రధానికి ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌తోపాటు ఢిల్లీ పోలీసుల గార్డ్‌ ఆఫ్ హానర్ మధ్య రెడ్ ఫోర్ట్‌లో వేడుకలు జరగనున్నాయి. 21 గన్ సెల్యూట్‌ తర్వాత జాతీయ గీతం పాడుతూ జెండాను ఎగరేస్తారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగిస్తారు. ప్రధాని స్పీచ్ ముగిసిన వెంటనే మళ్లీ నేషనల్ యాంథమ్ పాడతారు. అనంతరం గాలిలోకి మూడు రంగుల బెలూన్లను వదులుతారు. దీంతో కార్యక్రమం ముగుస్తుంది’ అని మినిస్ట్రీ ఆఫ్​ హోమ్ అఫైర్స్ ’(ఎంహెచ్‌ఏ) ఓ అడ్వైజరీలో తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఈ సూచనలను అన్ని రాష్ట్రాలకు ఎంహెచ్‌ఏ పంపింది. ఆత్మనిర్భర్ భారత్‌ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని స్టేట్స్‌కు ఎంహెచ్‌ఏ కోరింది. కరోనా నుంచి కోలుకున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్స్‌తోపాటు సాధారణ ప్రజలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపనున్నారు.