అప్పుడే సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది

అప్పుడే సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది

న్యాయస్థానాల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.ఇది న్యాయవ్యవస్థపై దేశంలోని సామాన్య పౌరులకు నమ్మకాన్ని పెంచుతుందన్నారు.2015లో అసంబద్ధంగా మారిన సుమారు 1800 చట్టాలను తాము గుర్తించామన్నారు. వీటిలో 1450 చట్టాలను కేంద్రం రద్దు చేసింది.. కానీ రాష్ట్రాలు కేవలం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్నిచర్యలు చేపడతామన్నారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు మోడీ.

దేశం అమృత కాలంలో ఉందని..ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ సులభంగా, సత్వర న్యాయం అందించే న్యాయవ్యవస్థ కోసం మనమంతా ఆలోచన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో న్యాయవిద్య అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు ఉండేలా చూడటం మనందరి బాధ్యత అన్నారు. 

న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహిస్తే.. సాధారణ పౌరుల్లో విశ్వాసం పెంపొందించడమే కాకుండా.. న్యాయవ్యవస్థకు వారిని దగ్గర చేసినట్లు అవుతుందన్నారు.పురాతన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.మన దేశంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి రక్షణగా ఉంటే.. శాసనశాఖ పౌరుల ఆశయాలను ప్రతిబింబించేలా పనిచేస్తుంటుందన్నారు.ఈ రెండు అంశాల కలయిక.. భవిష్యత్​లో సమర్థవంతమైన న్యాయవ్యవస్థ కోసం బీజం వేస్తుందని మోడీ తెలిపారు.

కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోడీ సూచించారు. సామాన్యులకు చట్టంలోని చిక్కులు కూడా తీవ్రమైన అంశమని చెప్పారు.అయితే ఢిల్లీలో జరిగిన న్యాయ సదస్సుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది.