చెస్​ ఒలింపియాడ్​ టార్చ్​​ రిలే.. ప్రారంభించిన మోడీ

చెస్​ ఒలింపియాడ్​ టార్చ్​​ రిలే.. ప్రారంభించిన మోడీ

ఒలింపిక్స్​లో  ‘టార్చ్ రిలే’ ఈవెంట్​వెరీవెరీ స్పెషల్​. ఇదే తరహా ఈవెంట్​ ను తొలిసారిగా  చెస్​ ఒలింపియాడ్​ కోసం ఆదివారం నిర్వహించారు. ఈ ప్రత్యేక ఘట్టానికి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. చెస్​ ఒలింపియాడ్​ టార్చ్​ రిలేను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.  అంతర్జాతీయ చెస్​ ఫెడరేషన్​ (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వోర్కోవిచ్​ టార్చ్​ ను  ప్రధాని మోడీకి అందజేశారు.  అనంతరం ప్రధాని మోడీ దాన్ని చెస్​ గ్రాండ్​ మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్​ కు ఇచ్చారు.  


ఈ టార్చ్​ మన దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న  75 పట్టణాలు తిరుగుతుంది.  అన్ని రాష్ట్రాల్లో అక్కడి  చెస్​ గ్రాండ్​ మాస్టర్లు టార్చ్​ ను అందుకుంటారు. చివరగా ..  జూలై 28 నుంచి 44వ చెస్​ ఒలింపియాడ్​ కు ఆతిథ్యమివ్వనున్న తమిళనాడులోని మహాబలిపురానికి టార్చ్​ చేరుకుంటుంది.  ఆగస్టు 10 వరకు  ఈ పోటీలు జరుగుతాయి.  ఓపెన్​, మహిళల విభాగాల్లో 11 రౌండ్లలో చెస్​ పోటీలు జరుగుతాయి. 187 దేశాలకు చెందిన దాదాపు 2వేల మందికిపైగా ప్లేయర్లు ఇందులో పాల్గొంటారు.  కాగా,  టార్చ్​ రిలే ప్రారంభ కార్యక్రమంలో చెస్​ చాంపియన్లు విశ్వనాథన్​ ఆనంద్​, కోనేరు హంపి కూడా పాల్గొన్నారు.