కరోనాపై పోరాటంలో ఈ నిర్ణయం ఓ మైలురాయి

కరోనాపై పోరాటంలో ఈ నిర్ణయం ఓ మైలురాయి
  • గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్: భారతదేశ వాక్సినేషన్ చరిత్ర లో,  కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రధాని మోడీ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని  గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశంలో  18 సంవత్సరాలు పైబడిన  అందరికీ ఉచిత వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఒక ప్రకటన ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
జాతినుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి చేసిన ప్రసంగం ద్వారా  దేశ ప్రజలందరికీ  రాబోయే కొద్ది నెలల్లోనే  వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి దార్శనికతతో గత సంవత్సరం మే నెలలోనే వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవడం వల్లనే రెండు దేశీయ వ్యాక్సిన్లు అందుబాటులోకి  వచ్చాయన్నారు.
ఏ అభివృద్ధి చెందిన దేశానికీ తీసిపోకుండా భారతదేశం వ్యాక్సిన్ తయారీలో, పంపిణీలో ముందంజలో ఉందని,  ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలతో దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్  జరుగుతుందని డాక్టర్ తమిళిసై అన్నారు.
ప్రధానమంత్రి యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలతో మెడికల్ ఆక్సిజన్ కొరతను అధిగమించామని, అలాగే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని భారతదేశంలో పది రెట్లు పెంచామని గవర్నర్ వివరించారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి   గరీబ్ కల్యాణ్ యోజన  ద్వారా దేశంలోని 80 కోట్ల మంది కుటుంబాలకి నవంబర్ వరకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించడం చాలా గొప్ప నిర్ణయం అని గవర్నర్ ఉన్నారు.  దేశంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదు అన్న స్ఫూర్తికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని డాక్టర్ తమిళిసై  స్పష్టం చేశారు.
పుదుచ్చేరిలో ఆగస్టు 15 నాటికి 100 శాతం వ్యాక్సినేషన్
గవర్నర్ ఈ రోజు రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుదుచ్చేరిలోని అన్ని ప్రాంతాల అధికారులతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల  రోజు వరకు పుదుచ్చేరిలో 100 శాతం వ్యాక్సినేషన్ జరగాలని వారికి డాక్టర్ తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్  గా ఆదేశించారు.